iDreamPost
android-app
ios-app

గోదావరి డెల్టా ఆశలన్నీ… బలిమెల పైనే

  • Published Jan 19, 2022 | 7:28 AM Updated Updated Mar 11, 2022 | 10:23 PM
గోదావరి డెల్టా ఆశలన్నీ… బలిమెల పైనే

గోదావరి డెల్టాలో రబీసాగుకు నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయి ఆయకట్టుకు అనుమతి ఇచ్చినందున అదనపు నీటి సేకరణకు సాగునీటి పారుదల శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. వారికి కనిపిస్తున్న ఒకే ఒక ఆశ ఒడిస్సాలోని బలిమెల రిజర్వాయర్‌. ఇక్కడ నుంచి మన వాటాకు వచ్చే నీటికన్నా ఈసారి అదనంగా నీరు సేకరించాల్సి ఉంది. ఇంత నీటిని రప్పించాలంటే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ చొరవ చూపాల్సిందేనని డెల్టా రైతులు కోరుతున్నారు.

ఉభయ గోదావరి అధికారుల లెక్కల ప్రకారం సుమారు 8 లక్షల 69 వేల ఎకరాల్లో రబీసాగు జరుగుతోంది. ఎకరాకు 45 బస్తాలు (75 కేజీలు)లకు పైబడి రెండు జిల్లాల్లో సుమారు 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. గత ఏడాది అధిక వర్షాల వల్ల ఖరీఫ్‌ పంట దెబ్బతిన్నందున రబీ పంటపై రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. సాగునీటిపారుదల శాఖ అధికారుల లెక్కల ప్రకారం రబీ పంట కాలంలో సాగుకు 83 టీఎంసీలు, తాగునీటికి 7.22 కలిపి మొత్తం డెల్టాకు 90.22 టీఎంసీల నీరు అవసరం. కాని ఈ సీజన్‌లో సహజ జలాల రూపంలో 35.381 టీఎంసీల నీటి లభ్యత ఉంది. పోలవరం ప్రాజెక్టులో ఈ ఏడాది కొత్తగా 16 టీఎంసీల నీరు అందుబాటులో ఉండటం వల్ల సహజ జలాలు ఎక్కువగా ఉన్నాయి. సీలేరు వపర్‌ జనరేషన్‌ నుంచి 33.601 టీఎంసీల నీరు వస్తుంది. ఇంకా సాగుకు 21.238 టీఎంసీల నీరు కావాల్సి ఉంది. ఇది పొందాలంటే మనకు ఉన్న ఏకైక మార్గం బలిమెల రిజర్వాయర్‌ ఒక్కటే.

బలిమెల రిజర్వాయర్‌ను ఒడిస్సాలోని మల్కన్‌గిరి జిల్లాలో నిర్మించారు. గోదావరి ఉప నది సీలేరు మీద ఉన్న ఈ రిజర్వాయర్‌ నిర్మాణంలో ఒడిస్సాతోపాటు ఆంధ్రప్రదేశ్‌ కూడా భాగస్వామ్యంగా ఉంది. దీనిలో నీటిని చెరి సమానంగా పంచుకుంటున్నారు. నీటి నిల్వ సామర్ధ్యం 90 టీఎంసీలు. ఈ రిజర్వాయర్‌ నీటిని 90 శాతం విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. ఇదే ఆంధ్రాకు వరంగా మారింది. ఇక్కడ 585 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. జల విద్యుత్‌కు వినియోగించిన నీరు దిగువున ఉన్న ఆంధ్రాలోని తొలుత ఎగువ సీలేరుకు, అక్కడ నుంచి డొంకరాయ, దిగువ సీలేరు ప్రాజెక్టుల్లో విద్యుత్‌ ఉత్పత్తి జరిగి చివరకు గోదావరి డెల్టాకు చేరుకుంటుంది.

గోదావరి ప్రధాన నది మీద తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరంతోపాటు పెద్ద ఎత్తున ఎత్తిపోతల పథకాలు ప్రారంభించడంతో రెండవ పంట సమయంలో ఎగువ నుంచి నీరు తక్కువగా వస్తుంది. గోదావరికి వచ్చే సహజ జలాలు రబీ సీజన్‌లో 30 టీఎంసీలు మించడం లేదు. దీనితో సాగు కోసం పూర్తిగా సీలేరు నది నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడాల్సి వస్తుంది.

బలిమెల ప్రాజెక్టు 96 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం. ఈ ఏడాది సరైన వర్షాలు లేక కేవలం 58 టీఎంసీ లు మాత్రమే నీరు ఉంది. వాస్తవంగా మనకు సగం వాటా 29 టీఎంసీలు రావాల్సి ఉంది. వివిధ కారణాలతో మనం ముందుగానే వాడడం వల్లే మనకు ఇప్పుడు కేవలం 22 టీఎంసీలు నీరు మాత్రమే దిగువనకు వదులుతారు. దీనికి ఇతర చోట్ల నుంచి వచ్చే నీటితో కలిసి సీలేరుకు అక్కడ నుంచి గోదావరి డెల్టాకు 33.601 టీఎంసీల నీరు వస్తుంది. ఏకంగా 21.238 టీఎంసీల నీరు తక్కువగా ఉందని తెలిసి రైతులు ఆందోళనతో ఉన్నారు. ఇప్పటికే నీటి ఎద్దడి ప్రభావం డెల్టాలో కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో నీరు ఇవ్వనందున మెరక, శివారు ప్రాంతాల్లో నారుమడులు, నాట్లు ఆలస్యమవుతున్నాయి. దీని వల్ల ఏప్రిల్‌ నెలాఖరు వరకు నీరు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అది మరింత ప్రమాదకరమవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని గోదావరి డెల్టాలో రబీకి నీటి ఎద్దడి రాకుండా ఒడిస్సా ప్రభుత్వంతో మన ప్రభుత్వం చర్చలు జరపాలని రైతులు కోరుకుంటున్నారు. ఇక్కడ నుంచి కనీసం 15 టీఎంసీల నీరు అందనంగా రప్పించగలిగితేనే రబీ గట్టెక్కే అవకాశముంది.

రబీ సమయంలో గోదావరి డెల్టాకు నీటి ఎద్దడి రావడం సహజమే. 2008-09లో గోదావరి డెల్టాలో రబీకి ఇదే పరిస్థితి ఎదురైన సమయంలో నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చొరవ చూపారు. బలిమెల నుంచే కాకుండా ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న కెన్నెరసాని నుంచి కూడా అదనపు నీటిని రప్పించి సాగును గట్టెక్కించారు. ఆయన స్ఫూర్తితో రైతులే తొలి ప్రాధాన్యతగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి సైతం చొరవ చూపి బలిమెల నుంచి అదనపు నీటిని రప్పించాలని డెల్టా రైతులు కోరుకుంటున్నారు.