Idream media
Idream media
మార్చి 24,1972న విడుదల అయిన హాలీవుడ్ సినిమా గాడ్ ఫాదర్ పెను సంచలనం సృష్టించింది. అప్పటి వరకూ ఉన్న రికార్డులను తుడిచిపెట్టిన కలెక్షన్లతో ప్రేక్షకులనే కాకుండా విమర్శకులనూ మెప్పించింది ఈ సినిమా. న్యూయార్క్ నగరానికి చెందిన మాఫియా డాన్ విటో కొర్లియోనే కథ ఇది. నటన, దర్శకత్వం, సంగీతం, ఫోటోగ్రఫీ ఇలా అన్ని రంగాలలో అత్యున్నత విలువలతో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికీ ఆల్ టైమ్ బెస్ట్ జాబితాలో చోటు దక్కించుకుంటూ ఉంది.
ఎన్నో చిత్రాలకు స్ఫూర్తి
మహాభారతం గురించి వేద వ్యాసుడు “ప్రపంచంలో ఉన్నదే భారతంలో ఉంది. భారతంలో లేనిది మరెక్కడా లేదు” అన్నట్లు, మాఫియా, డాన్, గాడ్ ఫాదర్ సబ్జెక్టుతో ఏ భాషలో ఎప్పుడు సినిమా వచ్చినా అందులో ఒకటో రెండో సీన్లు గాడ్ ఫాదర్ సినిమాని గుర్తు చేసేలా ఉంటాయి.
కమల్ హాసన్ కెరీర్లోనే గొప్ప చిత్రం నాయకుడులో, కుమార్తెకు అన్యాయం చేసిన వారిని ఏమీ చేయలేక న్యాయం కోసం వీరూ నాయర్ దగ్గరకు పోలీస్ ఆఫీసర్ రావడం కానీ, కుటుంబ గొడవలకు దూరంగా ఉంటున్న వ్యక్తి చివరకు ఆ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన గాయం సినిమా కానీ గాడ్ ఫాదర్ నుంచి తీసుకున్నవే. తెలుగులో వచ్చిన నేటి సిద్ధార్థ, హిందీ సినిమా సర్కార్ లాంటి ఎన్నో సినిమాలు గాడ్ ఫాదర్ ఆధారంగా వచ్చినవే.
అందరూ ఆర్థిక సంక్షోభంలో ఉన్న వారే
హాలీవుడ్ నిర్మాణ సంస్థ పారమౌంట్ స్టూడియోస్ 1967 నాటికి వరుస ఫ్లాపులతో ఆర్థికపరమైన కష్టాలలో ఉన్నప్పుడు మేరియో ప్యూజో అన్న ఇటలీ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ రచయిత రాస్తున్న గాడ్ ఫాదర్ నవల గురించి ఆ సంస్థ వారికి తెలిసింది. నవల పూర్తి కాకముందే పన్నెండున్నర వేల డాలర్లకు దాని హక్కులు కొనుగోలు చేసింది సినిమా పూర్తయ్యాక మరో ఎనభై వేల డాలర్లు చెల్లించే ఒప్పందంతో. తన ఏజంట్ “ఇంకా పెద్ద మొత్తానికి అమ్మొచ్చు. కొంచెం ఓపిక పట్టండి” అని వారిస్తున్నా, కేసినోలో జూదం ఆడి వారికి బాకీ పడిన పదివేల డాలర్ల కోసం ఆ కేసినో నడుపుతున్న మాఫియా వేధింపుల నుంచి బయటపడడానికి నవల హక్కులు తక్కువకే ఆమ్మివేశాడు ప్యుజో.
సినిమాకి దర్శకత్వం వహించడానికి స్టూడియో పన్నెండు మందిని సంప్రదిస్తే అందరూ నిరాకరించారు. అప్పుడు ఇటలీ మూలాలు ఉన్న ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా పేరు తెరమీదకు వచ్చింది. కొప్పోలా గాడ్ ఫాదర్ నవల చీప్ గా ఉందని ముందు తిరస్కరించినా, అతను నిర్మాతగా మారి తీసిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడం వలన అప్పుల్లో మునిగిపోయి ఉండడంతో, వాటిని తీర్చడం కోసం తన సహనిర్మాత జార్జి లూకాస్ సలహా మేరకు లక్షా ఇరవై అయిదు వేల డాలర్లు పారితోషికం, విడుదల అయ్యాక లాభాల్లో వాటా ఇచ్చేలా ఒప్పందం చేసుకుని దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.
సూపర్ స్టార్ కి స్క్రీన్ టెస్ట్
సినిమాలో గాడ్ ఫాదర్ విటో కొర్లియోనె పాత్రకు కొప్పోలా సూచించిన సూపర్ స్టార్ మార్లన్ బ్రాండోని స్టూడియో వారు ఒప్పుకోలేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన బ్రాండో నటించిన చిత్రాలు అప్పటికి పది సంవత్సరాలుగా ఒకదాని వెంట మరొకటిగా ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. అయితే బ్రాండో అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలడని అతని కోసం పట్టుపట్టాడు కొప్పోలా. స్క్రీన్ టెస్ట్ చేసి అందులో పాసయితేనే బ్రాండోని తీసుకోవడానికి స్టూడియో ఎగ్జిక్యూటివ్ లని ఒప్పించాడు కొప్పోలా.
బ్రాండో లాంటి సూపర్ స్టార్ ని స్క్రీన్ టెస్టు చేసుకోమని అడిగే సాహసం చేయలేకపోయారు కొప్పోలా. ఒకరోజు కెమెరా, లైటింగ్ సామగ్రి తీసుకెళ్లి “ఇందులో కొంచెం భారీ మేకప్ ఉంటుంది సార్. చిన్న మేకప్ టెస్టు చేద్దాం” అనడిగితే బ్రాండో అంగీకరించాడు. ఆ ఇంట్లోనే ఉన్న నల్లరంగు షూ పాలిష్ వాడి బ్రాండో తెల్లజుట్టు నల్లగా చేసి, డాన్ లుక్ కోసం వెనక్కి దువ్వి, లావుపాటి దవడల కోసం టిష్యూ పేపర్ నోట్లో ఉంచుకోమని మూడు సీన్లు షూట్ చేశాడు కొప్పోలా. అవి చూసిన తర్వాత మారు మాట్లాడకుండా బ్రాండోని ప్రధాన పాత్రకు ఓకే చేశారు స్టూడియో ఎగ్జిక్యూటివ్ లు. టిష్యూ పేపర్ నోట్లో పెట్టుకుని డైలాగులు చెప్పడం చాలా బాగా వచ్చింది కాబట్టి సినిమా అంతా బ్రాండోతో అలాగే డైలాగులు చెప్పించాడు కొప్పోలా. డాన్ కొడుకు మైఖేల్ కొర్లియోనె పాత్ర కోసం ఆల్ పేచినో పేరుని కూడా స్టూడియో వారితో పోట్లాడి ఒప్పించాడు కొప్పోలా.
షూటింగ్ మొదలయ్యాక కూడా కొప్పోలా పనితీరుతో విబేధాలు వచ్చాయి స్టూడియో వారికి. బడ్జెట్ పెరిగిపోతూందని, షూటింగ్ ఆలస్యం అవుతోందని నిత్యం గొడవలతో అనుకున్న బడ్జెట్ కన్నా తక్కువలో, అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తి చేశాడు కొప్పోలా.
కలెక్షన్ల సునామీ
1972 మార్చి 14న ప్రివ్యూ జరుపుకుని, మార్చి 24న విడుదల అయిన గాడ్ ఫాదర్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏడు మిలియన్ డాలర్లతో నిర్మితమైన సినిమా ఏకంగా రెండు వందల ఎనభై ఏడు మిలియన్ డాలర్లు వసూలు చేసింది. విమర్శకులు సినిమాని ఆకాశానికి ఎత్తేశారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో పదకొండు కేటగిరీలలో నామినేషన్లు పొంది, అయిదు అవార్డులు గెలుచుకుంది. అలాగే ఆస్కార్ అవార్డులలో కూడా పదకొండు కేటగిలలో నామినేషన్లు పొంది, ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులు గెలుచుకుంది.
ఆస్కార్ అవార్డును తిరస్కరించిన బ్రాండో
అందరూ ఊహించినట్టుగానే ఆ సంవత్సరం తన అద్భుత నటనకు ఉత్తమ నటుడు విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు మార్లన్ బ్రాండో. అంతకుముందు 1955లో ఆన్ ది వాటర్ ఫ్రంట్ చిత్రంలో నటనకు కూడా ఇదే విభాగంలో ఆస్కార్ గెలిచి ఉన్నాడు బ్రాండో. అయితే ఈసారి ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ కు బ్రాండో హాజరు కాలేదు. అతని బదులుగా సచీన్ లిటిల్ ఫెదర్ అనే బాలనటిని నాలుగు పేజీల ఉపన్యాసంతో పంపించాడు.
బ్రాండో పేరు ప్రకటించగానే ఆ అమ్మాయి వేదిక మీదకు వచ్చి “హాలీవుడ్ సినిమాల్లో అమెరికాలోని స్థానిక రెడ్ ఇండియన్లను వివక్షాపూరితంగా చిత్రీకరిస్తున్నందుకు నిరసనగా మార్లన్ బ్రాండో ఈ అవార్డును తిరస్కరించారు” అని చెప్పి తన చేతిలోని నాలుగు పేజీల ఉపన్యాస పాఠాన్ని విలేకరులకి ఇచ్చి వచ్చేసింది. మరుసటి రోజు ఇది అన్ని వార్తాపత్రికలలో పతాక శీర్షిక అయింది. హాలీవుడ్ లో నల్లజాతీయుల కోసం, రెడ్ ఇండియన్ల కోసం చాలా రోజుల నుంచి బ్రాండో చేస్తున్న పోరాటానికి దీంతో అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.
కొన్ని ఆసక్తికర విషయాలు
ఈ సినిమాలో ఒకచోట డాన్ కోరిక మన్నించని ఒక హాలీవుడ్ స్టూడియో అధినేత ఎంతో ఇష్టంగా పెంచుకునే మేలుజాతి గుర్రం తల నరికి, నిద్రలో ఉండగా అతని మంచం మీద అతని పక్కలో వేసే సన్నివేశం ఒకటి ఉంది. బొమ్మ తలకు రక్తం పూసి వాడుదాం అన్న సలహా కొప్పోలాకి నచ్చలేదు. గుర్రాల మాంసంతో కుక్కలకు ఆహారం తయారుచేసే ఫ్యాక్టరీకి వెళ్లి, అక్కడ తన సినిమాలో చూపించే గుర్రం పోలికలతో ఉన్న గుర్రాన్ని చూసి, “దీన్ని ఎప్పుడు చంపినా దీని తల నాకు కావాలి” అని డబ్బులు ఇచ్చి వచ్చాడు కొప్పోలా. మూడు రోజుల తర్వాత ఐస్ ముక్కల మధ్య ఆ తల వచ్చింది. దానికి రక్తం పూసి ఆ సీన్ చిత్రీకరించారు.
ఈ చిత్రంలో మార్లన్ బ్రాండో ఉన్న సన్నివేశాలను తక్కువ లైటింగ్ ఉపయోగించి చిత్రీకరించారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పని చేసిన గార్డెన్ విల్లిస్ కి ఆ తర్వాత “ప్రిన్స్ ఆఫ్ డార్క్ నెస్” అని పేరు వచ్చింది. చీకటి వ్యాపారం చేస్తుంటారు కాబట్టి చీకట్లో చిత్రీకరణ చేశారు అని విమర్శకులు ప్రశంసలు గుప్పించారు. కానీ అసలు కారణం మార్లన్ బ్రాండోకి చేసిన భారీ మేకప్ కనిపించకుండా తక్కువ లైటింగ్ వాడారు. ప్రతిరోజూ బ్రాండో మేకప్ కి మూడు గంటల సమయం పట్టేది. లైటింగ్ తక్కువ చేయడంతో అది తెరమీద కనిపించలేదు. అయితే విమర్శకుల ప్రశంసలు చూసిన కొప్పోలా గాడ్ ఫాదర్ సీక్వెల్స్ లో మార్లన్ బ్రాండో లేకపోయినా డార్క్ లైటింగ్ కొనసాగించాడు.
ఒక సన్నివేశంలో డాన్ పెద్దకొడుకు ఆవేశపూరితుడైన సోనీ కొర్లియోనె తన చెల్లెలును కొట్టినందుకు ఆమె భర్తని కొడతాడు. ఈ సన్నివేశంలో డాన్ కొడుకుగా నటించిన జేమ్స్ కాన్ కి, చెల్లెలు భర్తగా నటించిన గియానీ రూసోకి అంతకు ముందు నుంచే గొడవలు ఉన్నాయి. సీన్ లో రూసోని కింద పడేసి కాలుతో తన్నడం, ఇనుప చెత్త క్యాన్ తో తలమీద కొట్టడం లాంటి షాట్లు చాలా బాగా వచ్చాయని టీమ్ చప్పట్లు కొడుతుంటే రూసో బాధతో విలవిలలాడుతూ ఉన్నాడు. ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తే రెండు పక్కటెముకలు, దవడ ఎముక విరిగినట్టు తెలిసింది.
సినిమా ప్రకటించాక కొంతమంది అమెరికాలోని ఇటాలియన్ జాతీయులు ఈ సినిమా తమ పరువు తీసే విధంగా ఉంటుందని గొడవ చేశారు. ఈ గొడవ వెనక కొంతమంది మాఫియా డాన్ లు కూడా ఉన్నారు. సినిమాలో మాఫియా అన్న పదం కానీ, అదే అర్థం వచ్చే ఇటాలియన్ కోసానోస్ట్రా అనే పదం కానీ వాడము అని నిర్మాతలు హామీ ఇచ్చాక ఆ గొడవ సద్దుమణిగింది.
రెండు సీక్వెల్స్
గాడ్ ఫాదర్ విజయం తర్వాత డాన్ విటో కొర్లియోనె సిసిలీ నుంచి అమెరికా రావడం, చేతిలో చిల్లిగవ్వ లేని స్థితి నుంచి న్యూయార్క్ నగరాన్ని శాసించే డాన్ గా ఎదిగే క్రమాన్ని ఒకవైపు, విటో మరణం తర్వాత అతని కుమారుడు మైఖేల్ కొర్లియోనె ఎదిగే క్రమాన్ని మరోవైపు సమాంతరంగా చూపిస్తూ యువకుడైన విటోగా రాబర్ట్ డి నీరో నటించగా రెండవ భాగాన్ని తీసి, 1974లో విడుదల చేశారు. దీనికి ఉత్తమ దర్శకుడుగా కొప్పోలాతో సహా ఆరు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. 1990లో మూడవ భాగం కూడా వచ్చింది. వసూళ్ళపరంగా బాగా ఆడినా మొదటి రెండు సినిమాల స్థాయిలో లేదని విమర్శకులు పెదవి విరిచారు. నవలలోని కథను విస్తరించి నాలుగవ భాగం తీయడానికి నవలా రచయిత మేరియో ప్యూజోతో కలిసి ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా స్క్రిప్టు రెడీ చేస్తుండగా ప్యూజో మరణించడంతో అది ఆగిపోయింది.
దాదాపు అయిదు దశాబ్దాలు గడిచినా గ్యాంగ్ స్టర్ సినిమాలను అభిమానించే ప్రేక్షకుల హృదయాల్లో గాడ్ ఫాదర్ స్థానం సుస్థిరంగా నిలిచి ఉంది. ఆ తరహా సినిమాల్లో ఈనాటికీ ఏదో ఒక సన్నివేశం గాడ్ ఫాదర్ ని గుర్తు చేస్తూ ఉంది అంటే ఆ కథ గొప్పతనమే!