మా తాతగారు, మాజీ రాష్ట్రపతి జైల్ సింగ్ కాంగ్రెసుకు సేవకుడిలా పని చేశారు. కానీ పార్టీ ఆయన్ను చివరి రోజుల్లో పట్టించుకోలేదు. ఆయన మరణంపై కూడా అనుమానాలు ఉన్నాయి. అది హత్యా..ప్రమాదమా? అన్న అనుమానాలను కూడా ఇంతవరకు నివృత్తి చేయలేదు.. అని ఆయన మనవడు ఇంద్రజిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పాత వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాయి. కేంద్ర మంత్రి హార్డీప్ సింగ్ పూరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న సందర్బంగా ఇంద్రజిత్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలతో పాటు.. జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీతో ఉన్న విభేదాలు కూడా మరోసారి తెరపైకి వస్తున్నాయి.
ప్రమాదంపై అనుమానాలు
1987లో రాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన అనంతరం జ్ఞానీ జైల్ సింగ్ మరే పదవులు నిర్వహించలేదు. చండీగఢ్ లో నివాసం ఉన్న ఆయన 1994 నవంబర్ 29న ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. ఆనంద్ పూర్ సాహెబ్ నుంచి చండీగఢ్ కు తిరిగి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారును కీరత్ పూర్ సాహెబ్ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ ఢీకొంది. గాయాలపాలైన జైల్ సింగ్ చండీగఢ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుమారు నెల రోజుల అనంతరం 1994 డిసెంబర్ 25న కన్నుమూశారు. ఆయన మృతిపై అనుమానాలు తలెత్తాయి. ప్రమాదం జరిగినప్పుడు ఆయన కాన్వాయ్ వెంట ఉండాల్సిన అంబులెన్స్ రోపార్ రెస్ట్ హౌస్ వద్ద ఉంది. అలాగే జైల్ సింగ్ వెంట ఆ సమయంలో కేవలం ఇద్దరు భద్రతా సిబ్బందే ఉన్నారు. ప్రమాదం జరిగిన గంటన్నర తర్వాత ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఇవన్నీ ప్రమాద ఘటనపై అనుమానాలు, భద్రత వైఫల్యాలపై ఆరోపణలకు తావిచ్చాయి.
రాజీవ్ తో విభేదాల నేపథ్యంలో ఇది జరిగిందనడానికి ఆ సమయంలో రాజీవ్ జీవించిలేరు. అప్పటికి మూడేళ్లుగా పీవీ ప్రధానిగా ఉన్నారు. అయితే ఆరోపణలు, అనుమానాలు నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ జరిపించింది. జైల్ సింగ్ కు జరిగిన ప్రమాదం వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదని ఆ విచారణలో తేలింది.
Also Read : ప్రియాంక గాంధీ 12 వేల కిలోమీటర్ల పాదయాత్ర
రాజీవ్ తో విభేదాలు
జీవితాంతం కాంగ్రెసుకే అంకితమైన జైల్ సింగ్ పంజాబ్ సీఎంగా 1980 నుంచి 1982 వరకు ఇందిరాగాంధీ కేబినెట్లో హోంమంత్రి గా పనిచేశారు. అప్పుడే .. 1982లో దేశ ఏడో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ నాయకురాలు చెబితే ఊడ్చే పనికి కూడా సిద్ధమేనని.. కానీ ఆమె రాష్ట్రపతిగా పనిచేయమని ఆదేశించారని వ్యాఖ్యానించి.. ఇందిర పట్ల విధేయత చాటుకున్నారు.
జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే ఖాలిస్తాన్ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రం ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించింది. ఆయన హయాంలోనే 1984లో ఇందిరా గాంధీ సిక్కు బాడీ గార్డుల కాల్పుల్లో హతమయ్యారు. ఈ రెండు ఘటనలు.. తదనంతర కాలంలో ప్రధాని అయిన రాజీవ్ కు జైల్ సింగ్ పై అపనమ్మకాన్ని పెంచాయి. అప్పటి నుంచీ రాష్ట్రపతి, ప్రధాని మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాల సమాచారం రాష్ట్రపతికి అందేది కాదు. ఒకటి రెండు సందర్భాల్లో రాష్ట్రపతి జైల్ సింగ్ దీనిపై తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. దానికి తోడు 1987లో కేంద్రం రూపొందించిన పోస్టల్ సెన్సార్ షిప్ బిల్లుపై సంతకం పెట్టడానికి జైల్ సింగ్ నిరాకరించడం విభేదాలను మరింత పెంచి రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందా అన్నంత వరకు వెళ్లింది.
ఖాలిస్తాన్ వాదులతో జైల్ సింగుకు సంబంధాలు ఉన్నాయని, ప్రతిపక్ష నేతలు, కాంగ్రెసులోని అసమ్మతి నేతలతో తరచూ సమావేశం అవుతున్నారాన్న అనుమానంతో జైల్ సింగుపై రాజీవ్ నిఘా కూడా ఏర్పాటు చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. చివరికి 1987 మార్చి 27న తమ మధ్య స్పర్థలు తొలగించుకునేందుకు రాష్ట్రపతి భవన్ లోనే ఇరువురు నేతలు సుమారు రెండు గంటలకు పైగా భేటీ అయ్యారు. దాంతో విభేదాలు తొలగిపోయినట్లు సంకేతాలు వచ్చినా అంతర్గతంగా జైలు సింగ్ పదవీవిరమణ చేసేవరకు అవి కొనసాగాయని అంటారు. జైల్ సింగ్ మనవడు ఇంద్రజిత్ సింగ్ నిన్న బీజేపీలో చేరిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఆనాటి ఘటనలను మళ్లీ జ్ఞప్తికి తీస్తున్నాయి.
Also Read : పని రాక్షసుడు.. ఆస్కార్ ఫెర్నెండేజ్