iDreamPost
android-app
ios-app

దేవాలయాల్లో గ్రేట‌ర్ అభ్యర్థులు

దేవాలయాల్లో గ్రేట‌ర్ అభ్యర్థులు

హోరాహోరీగా జరిగిన గ్రేటర్‌ పోరు ఫలితాలు కొద్ది గంటల్లో తేలిపోనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చాయి. మెజార్టీ పోల్స్‌ టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టినా గతం కంటే సీట్లు తగ్గాయి. ఇదిలా ఉంటే.. సమయం దగ్గర కొచ్చే కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. బ్యాలెట్‌ బాక్స్‌ల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం తెల్లవారి మొదలు గంటలు గడిచే కొద్దీ తేలిపోనుంది. పోలింగ్‌ జరిగే వరకూ ఓటర్ల దేవుళ్ల చుట్టూ తిరిగిన అభ్యర్థుల్లో చాలా మంది ఇప్పుడు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ఆయన అనుగ్రహం ఉంటే..

ఓటర్లతో పాటు ఇష్ట దైవాల అనుగ్రహం ఉంటే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని పలువురు అభ్యర్థులు నమ్ముతున్నారు. ఎన్నికలను పురస్కరించుకుని నామినేషన్లు దాఖలు చేసినప్పటి నుంచి తమ ఇంటి ఇల వేల్పులను, ఇష్టదైవాలను ప్రార్థిస్తూనే ఉన్నారు. తాము పోటీచేస్తున్న డివిజన్‌లో గెలిస్తే నచ్చిన కానుకలు చెల్లిస్తామని, ఆల యాల వద్దకు వచ్చి తలనీలాలు సమర్పిస్తామని ప్రార్థిస్తున్నారు. లక్షలు ఖర్చుచేసిన తమను దీవించాలని మనసారా వేడుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో డిసెంబర్‌ 1న జరిగిన బల్దియా ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గ్రేటర్‌పై మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తామని టీఆర్‌ఎస్‌ నాయకులు, నగరంలో బీజేపీ సత్తాను చాటుతామని ఆ పార్టీ నేతలు తొడగొట్టి ప్రచారం నిర్వహించడంతో నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే నేతలు మాట్లాడిన తూటాల్లాంటి మాటలు.. ఓటర్లను ఎంతమేరకు ప్రభావితం చేశాయి.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది శుక్రవారం జరిగే కౌంటింగ్‌తో తేలిపోనుంది.

సెంటిమెంట్‌ ఫలించేనా..?

నగరంలోని 150 డివిజన్లలో వివిధ పార్టీల నుంచి ఈసారి 1122 మంది అభ్యర్థులు పోటీచేశారు. అయితే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కోట్లు కుమ్మరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో పోటీతీవ్రంగా ఉన్న చోట్ల బీజేపీ నాయకులు సైతం టీఆర్‌ఎస్‌కు దీటుగా ఖర్చు చేసినట్లు తెలిసింది. అయితే విపరీతంగా డబ్బులు ఖర్చు చేసిన ప్రాంతాల్లోని పలువురు అభ్యర్థులు కౌంటింగ్‌ నేపథ్యంలో ప్రస్తుతం దేవుళ్లపై భారం వేస్తున్నారు. ఎలా గైనా తమనే విజయం వరించేలా చూడండి దేవుడా.. అంటూ ఇళ్లలో, ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. కాగా, కొంతమంది అభ్యర్థులు తాను గెలిస్తే ఇష్టదైవా లకు పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తానని, డివిజన్లలో చిన్నపాటి గుడులు కూడా కట్టిస్తామని మనసులో ప్రార్థిస్తున్నారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, ముషీరాబాద్‌, అంబర్‌పేట, సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌ నియోజక వర్గాల్లోని కొంతమంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇలాంటి వాటినే ఎంచుకున్నట్లు సమాచారం. ఈ మేరకు గురువారం వారు నగరంలోని పలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. మరి ఎవరు పూజలు ఫలిస్తాయో వేచి చూడాలి.