కిడ్నాప్ డ్రామా ఆడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బి.ఫార్మసీ విద్యార్థిని కథ విషాదంతంగా ముగిసింది. మంగళవారం రాత్రి విద్యార్థిని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది.
సంచలనం సృష్టించిన కిడ్నాప్ డ్రామా..
ఈ నెల 10న క్రితం తననెవరో ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసారంటూ ఘటకేసర్ ప్రాంతానికి చెందిన బి.ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో ఆందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులు డయల్ 100కు ఫోన్ చేశారు. అనంతరం విద్యార్ధినిని కాంటాక్ట్ అయిన పోలీసులు ఆమె ఉన్న లొకేషన్ ను ట్రేస్ చేసి అన్నోజీగూడ రైల్వేగేట్‌కు కాస్త దూరంలో పొదల్లో అర్ధనగ్నంగా ఉన్న యువతిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు.
అనంతరం అనుమానిత ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. మీడియా మొత్తం ఆటో డ్రైవర్లను నిందితులుగా చూపిస్తూ కథనాలు ప్రసారం చేసాయి. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్లు యువతిని కిడ్నాప్ చేయలేదని తేల్చారు. ఆమె ఇంటి బస్‌స్టాప్ నుండి యువతిని రక్షించిన స్థలమైన అన్నోజిగూడ వరకూ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు విద్యార్థిని ఒంటరిగానే నడుస్తూ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆటో డ్రైవర్లు నిర్దోషులని స్పష్టం చేశారు.
దాంతో పోలీసులను తప్పుదారి పట్టించిన ఆ యువతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆటో డ్రైవర్లకు క్షమాపణలు చెప్పారు.కిడ్నాప్ కథలంటే ఆ విద్యార్థినికి ఇష్టమని గతంలో కూడా తన తమ్ముడిని ఆస్తి కోసం కొందరు కిడ్నాప్ చేసారంటూ స్నేహితురాలికి కథ చెప్పిందని పోలీసులు తెలిపారు. ఆమెను కఠినంగా శిక్షించాలని కొందరు డిమాండ్ చేశారు. విద్యార్థినికి చికిత్స పూర్తయిన అనంతరం కేసులు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత యువతి తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. కాగా ఆమెపై విమర్శలు తీవ్రస్థాయిలో రావడం వల్ల మనస్తాపానికి గురైన విద్యార్థిని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రాణాలు విడిచింది.పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.