iDreamPost
iDreamPost
పడుతూ లేస్తూ ఆగుతూ సాగుతూ వెళ్లిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ ఎట్టకేలకు నిన్న పూర్తయ్యింది. ఈ మేరకు యూనిట్ అఫీషియల్ గా విడుదల చేసిన ఫోటోలు చూసి అభిమానులు హమ్మయ్య అనుకున్నారు. గత కొద్దిరోజులుగా ఇంకొంత పార్ట్ బాలన్స్ ఉందని ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదని రకరకాల ప్రచారాలు జరిగాయి. ఫైనల్ గా అవన్నీ అబద్దమని తేలిపోయింది. కీలకమైన కోర్ట్ ఎపిసోడ్స్ ఎప్పుడో షూట్ చేశారు కాబట్టి ఆర్టిస్టులకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ సీన్ అన్నీ లాక్ డౌన్ కు ముందే చిత్రీకరించడం చాలా ప్లస్ అయ్యింది.
ఇదిలా ఉండగా వకీల్ సాబ్ విడుదలకు ఘరానా సెంటిమెంట్ ని ఫాలో అయ్యే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు సమాచారం. అదేంటి అనుకుంటున్నారా. ఇరవై ఎనిమిదేళ్ల క్రితం 1992లో ఏప్రిల్ 9న విడుదలైన ఘరానా మొగుడు ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్టో అందరికీ గుర్తే. టాలీవుడ్ మొదటి పది కోట్ల సినిమాగా దాని రికార్డుల గురించి ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. వకీల్ సాబ్ ని కూడా అదే తేదీకి తీసుకురావాలనే ప్లానింగ్ జరుగుతున్నట్టు తాజా అప్ డేట్. అప్పటికంతా కరోనాకు సంబంధించిన ఆంక్షలు అన్నీ తొలగిపోయి ఉంటాయి కాబట్టి ఇలా చేయబోతున్నట్టు తెలిసింది. ఇంకా ఫైనల్ చేయలేదు.
ఇదే నిజమైతే అంతకన్నా గుడ్ న్యూస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇంకేముంటుంది. అంటే సరిగ్గా ఏడాది వాయిదాలో వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వస్తాడన్న మాట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన టీజర్ తో పాటు ఇచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డేకి రిలీజ్ చేసేలా ప్రస్తుతం ఎడిటింగ్ చేస్తున్నారట. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న వకీల్ సాబ్ లో కమర్షియల్ అంశాలు కాస్త తక్కువగానే ఉంటాయి. హీరోయిన్ ట్రాక్ కూడా ఫ్లాష్ బ్యాక్ లోనే వస్తుంది తప్ప సినిమా మొత్తం ఉండదు. కాకపోతే తమన్ ఎలాంటి పాటలు ఇచ్చి ఉంటాడన్న ఆసక్తి మాత్రం అభిమానుల్లో విపరీతంగా ఉంది. డాన్సులు గట్రా పెద్దగా ఆశించకపోవడం మంచిది.