iDreamPost
iDreamPost
తెలుగునాటే కాక ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులు సంపాదించుకున్న ఘంటసాల గారి కుటుంబంలో విషాదం రేగింది. ఆయన రెండో కుమారుడు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్-గాయకులు ఘంటసాల రత్నకుమార్ ఇవాళ ఉదయం చెన్నై కావేరి ఆసుపత్రిలో కన్ను మూశారు.
గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధ పడుతున్న రత్నకుమార్ దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇవాళ ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయారు. రత్నకుమార్ బయట ప్రపంచానికి అంతగా తెలియకపోయినా ఈయన గొంతు కోట్లాది ప్రేక్షకులకు సుపరిచితం.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రత్నకుమార్ ఎన్నో ఘనతలు సాధించారు. ఏకధాటిగా ఎనిమిది గంటల సేపు డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ లో రికార్డ్స్ లో పేరు సంపాదించారు. రాష్ట్రప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. వెయ్యి సినిమాలకు పైగా తన గొంతును హీరోలకు క్యారెక్టర్ ఆర్టిస్టులకు అందించారు. తెలుగు తమిళ సీరియల్స్ కు ఆయన చెప్పిన డబ్బింగ్ సుమారు పది వేలకు పైమాటే అని ఒక అంచనా. డాక్యుమెంటరీలు కూడా యాభైకి పైగానే ఉన్నాయి. జెమిని విశ్వదర్శనం ప్రోగ్రాం యాంకర్ గా చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. పన్నెండు గంటల పాటు డబ్బింగ్ చెప్పి కొత్త రికార్డుని సృష్టించాలనే ప్రయత్నంలో ఉండగానే ఇలా కాలం చేసి వెళ్లిపోయారు.
మాటల రచయితగానూ రత్నకుమార్ తన బహుముఖప్రజ్ఞను చూపించారు. సుమారు 30 సినిమాల దాకా ఆయన కలం పనిచేసింది. సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ హీరోలకు సైతం సౌత్ డబ్బింగ్ వెర్షన్లకు రత్నకుమార్ నే తీసుకునేవారు. గాయకుడిగా మాత్రం రత్నకుమార్ తన ముద్రవేయలేకపోయారు. ఈయన కుమార్తె వీణ ప్లే బ్యాక్ సింగర్ గా రాణిస్తోంది. అందాల రాక్షసి లాంటివి పేరు తీసుకొచ్చాయి. ఎప్పటికైనా దర్శకత్వం చేయాలనీ రత్నకుమార్ ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. కానీ నిర్మాత కోసం చూస్తున్న తరుణంలో ఎవరికీ అందనంత దూరానికి వెళ్లిపోయారు. పరిశ్రమ ఆయనకు ఘననివాళి అందిస్తోంది