Idream media
Idream media
ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికను ప్రపంచమంతా ఆసక్తిగా తిలకిస్తోంది. అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాదాపు ప్రపంచమంతటినీ ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈ ఆసక్తి. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నిక కావడమంటే ఆషామాషీ విషయం కాదు. ముందుగా పార్టీ తరఫున అభ్యర్థిగా ఎంపిక కావడానికి స్వంత పార్టీలోని వారితో పోటీ పడాలి. కాకస్ అనీ, ప్లీనరీ అని ఇలా చాలా దశల్లో పోటీపడి అభ్యర్థిగా ఎంపిక కావాలంటే కార్యకర్తలలో ఆదరణతో పాటు దండిగా అర్ధబలం కూడా కావాలి. విజయవంతంగా ఈ దశ దాటిన తరువాత దేశమంతా తిరిగి ప్రచారం, టీవీ డిబేట్లలో ప్రత్యర్థితో పోటీపడి, అమెరికాని అభివృద్ధి పథంలో నడపగలనన్న నమ్మకం ప్రజల్లో కల్గించాలి. ఇంతచేసినా ఒక్కోసారి అమెరికా అధ్యక్ష పదవికి ఎలక్టోరల్ కాలేజీ అనే పద్ధతిలో జరిగే ఎన్నిక వల్ల ప్రజలు ఎక్కువ మంది ఓట్లేసినా ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ బాదరబందీ ఏమీ లేకుండా ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా ఉపాధ్యక్ష పదవినీ, ఆ తరువాత అధ్యక్ష పదవినీ చేపట్టిన అదృష్టవంతుడు ఒకరు ఉన్నారు. ఆయనే గెరాల్డ్ ఫోర్డ్.
లాయర్, నేవీ, పాలిటిక్స్
ఫోర్డ్ బాల్యంలోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకోగా, తల్లి తన రెండవ భర్త గెరాల్డ్ ఫోర్డ్ పేరునే కొడుక్కి పెట్టింది. యేల్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఫోర్ట్, రెండవ ప్రపంచ యుద్ధంలో పసిఫిక్ లోని అమెరికా సైనిక స్థావరం పెరల్ హార్బర్ మీద జపాన్ దాడి తర్వాత అమెరికా నావికాదళం పిలుపు మేరకు అనేకమంది అమెరికన్ యువకులతో పాటు నేవీలో చేరాడు. లెఫ్టినెంట్ కమాండర్ ర్యాంకులు ఉండగా యుద్ధం ముగియడంతో మిచిగన్ రాష్ట్రంలో స్థిరపడి, రిపబ్లికన్ పార్టీలో చేరాడు. స్నేహితుల సలహా మేరకు పార్లమెంటు దిగువసభ కాంగ్రెస్ సభ్యుడిగా పోటీచేసి ఎన్నికయ్యాడు. ఇరవై అయిదు సంవత్సరాలు వరుసగా గెలుస్తూ, హౌస్ మైనారిటీ లీడర్ అయ్యాడు. నిజాయితీ పరుడు, అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఉన్నవాడు కావడంతో ప్రత్యర్థి పార్టీ సభ్యులు కూడా ఫోర్డ్ అంటే అభిమానంగా ఉండేవారు.
కుంభకోణల నిక్సన్ ప్రభుత్వం
1972లో వరుసగా రెండవ సారి అధ్యక్షుడుగా విజయం సాధించిన రిచర్డ్ నిక్సన్, అతని ఉపాధ్యక్షుడు స్పైరో ఆగ్న్యూ ఇద్దరూ కుంభకోణాలలో ఇరుక్కున్నారు. పన్ను ఎగవేత, లంచం తీసుకున్న అభియోగాలతో ఉపాధ్యక్షుడి మీద విచారణ మొదలైన సమయంలోనే వాటర్ గేట్ ప్రాంతంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ ఆఫీసులో కొన్ని కీలకమైన పత్రాల దోపిడీ అధ్యక్షుడి మెడకు చుట్టుకుంది. నేరం రుజువు కావడం ఖాయమని నిర్ధారణ కావడంతో ఉపాధ్యక్షుడు స్పైరో ఆగ్న్యూ అక్టోబర్ 10,1973న రాజీనామా చేశాడు. తన పార్టీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ సభ్యుడు, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీకి కూడా ఆమోదయోగ్యుడు అయిన గెరాల్డ్ ఫోర్డ్ ను ఉపాధ్యక్ష పదవికి అధ్యక్షుడు నిక్సన్ ఎంపిక చేశాడు. అదే సంవత్సరం డిసెంబర్ 6న ఫోర్డ్ ఆ పదవిలో ప్రమాణ స్వీకారం చేశాడు.
ఈలోగా వాటర్ గేట్ కుంభకోణంలో అధ్యక్షుడు నిక్సన్ పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలు లభ్యం కావడంతో 1974 ఆగస్టు 9న నిక్సన్ తన పదవికి రాజీనామా చేయడంతో అదే రోజు గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ విధంగా ప్రజల ఓట్లతో కానీ, ఎలక్టోరల్ ఓట్లతో కానీ సంబంధం లేకుండా దేశంలో రెండు అత్యున్నత పదవులు చేపట్టారు గెరాల్డ్ ఫోర్డ్.
నిక్సన్ తో క్విడ్ ప్రో కో
అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసి నెల తిరగకుండానే తన విచక్షణ అధికారం ఉపయోగించి, అన్ని కేసుల నుంచి మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కి క్షమాభిక్ష ఇచ్చాడు ఫోర్డ్. ఇది నిక్సన్, ఫోర్డ్ ల మధ్య క్విడ్ ప్రో కో అరేంజ్ మెంట్ అని ప్రతిపక్షం, మీడియా దుమ్మెత్తిపోశాయి. తనను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టిన నిక్సన్ రుణం ఫోర్డ్ ఈ విధంగా తీర్చుకున్నాడు అని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత వియత్నాం యుద్ధంలో సైన్యాన్ని విడిచిపెట్టి వెళ్లిన అమెరికన్ సైనికులందరికీ క్షమాభిక్ష ప్రసాదించడం లాంటి ప్రజామోదం పొందే పనులు కొన్ని చేసినా ప్రజల్లో, మీడియాలో ఫోర్డ్ ఇమేజ్ పెద్దగా మెరుగుపడలేదు. వియత్నాం యుద్ధం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండగానే 1976 అధ్యక్ష ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఫోర్డ్ ఓడిపోయాడు.
నిక్సన్ క్షమాభిక్ష తన ఓటమికి ప్రధాన కారణం అని పరిశీలకులు చేసిన విశ్లేషణతో ఫోర్డ్ ఏకీభవించాడు. అధ్యక్ష పదవిలో ఉండగా మరణించిన వారిని వదిలేస్తే, 895 రోజులతో అతి తక్కువ కాలం పదవిలో ఉన్న అధ్యక్షుడిగా రికార్డు సృష్టించాడు ఫోర్డ్. ఎన్నికల్లో ఓటమి తర్వాత అనేక కార్పొరేట్ సంస్థలు డైరెక్టర్ పదవిలో ఉండమని ఆహ్వానించినా అది తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతుందని అంగీకరించలేదు ఫోర్డ్.
తనను ఓడించిన జిమ్మీ కార్టర్ తో మరోసారి తలపడాలని 1980లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం ప్రయత్నించగా, అది రోనాల్డ్ రీగన్ కు దక్కింది. తనతో కలిసి ఉపాధ్యక్షుడిగా పోటీ చేయమని రీగన్ ఆహ్వానించినా, ఒకసారి అధ్యక్షుడుగా పనిచేసి, ఉపాధ్యక్ష పదవికి పోటీ పడడం చిన్నతనంగా భావించిన ఫోర్డ్, అధ్యక్షుడితో సమాన అధికారాలు ఉండే విధంగా సంయుక్త అధ్యక్షుడు పదవి అయితే సిద్ధం అని ఫోర్డ్ చెప్పినా, అమెరికా రాజ్యాంగంలో ఆ విధమైన వెసులుబాటు లేకపోవడంతో అది కుదరలేదు. ఆ తర్వాత వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలలో పాల్గంటూ రాజకీయాలకు దూరంగా 2096లో, తొంభై మూడేళ్ల వయసులో మరణించి అప్పటికి సుదీర్ఘ కాలం జీవించిన అమెరికా అధ్యక్షుడుగా మరో రికార్డు స్వంతం చేసుకున్నాడు గెరాల్డ్ ఫోర్డ్.