iDreamPost
android-app
ios-app

OTT గ్యాప్ ఇంకా తగ్గిపోతోంది

  • Published Feb 13, 2021 | 9:27 AM Updated Updated Feb 13, 2021 | 9:27 AM
OTT గ్యాప్ ఇంకా తగ్గిపోతోంది

రాబోయే రోజుల్లో ఓటిటి రంగంలో పెను విప్లవం మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా లాక్ డౌన్ తర్వాత జరిగిన పరిణామాలు దీనికి ఊతమిస్తున్నాయి. థియేటర్ కు చిన్ని తెరకు మధ్య ఉన్న గ్యాప్ విపరీతంగా తగ్గడం మొదలయ్యింది. ఒకప్పుడు కొత్త సినిమాను ఇంట్లో చూడాలంటె కనీసం ఏడాది నుంచి ఆరు నెలల దాకా వేచి చూడాల్సిన టైం నుంచి ఇప్పుడు కేవలం రెండంటే రెండు వారాల్లోనే బుల్లితెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతోంది. అప్పుడెప్పుడో కమల్ హాసన్ ఊహించినట్టు థియేటర్ కు ఇంటికి ఒకే రోజు సినిమా రిలీజులు జరిగే భవిష్యత్తు అతి దగ్గరలోనే ఉంది.

అన్ని వందల కోట్ల పెట్టుబడులు జరిగిన విజయ్ మాస్టర్ 16 రోజులకే వచ్చింది. 2021 మొదటి స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్ రవితేజ క్రాక్ కేవలం 20 రోజులకే ఆహా అంటూ డిజిటల్ రూపంలో పలకరించింది. అల్లుడు అదుర్స్ ఫ్లాపయినా నెల రోజుల వ్యవధి తీసుకుని ఈ రోజు నుంచి ప్రత్యక్షమయ్యాడు. రేపో ఎల్లుండో రామ్ రెడ్ దర్శనం కూడా జరిగిపోతుంది. ఆడేసి చల్లారిన జాంబీ రెడ్డి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, బంగారు బుల్లోడు లాంటివి కూడా వచ్చేస్తున్నాయి. అంటే కాస్త ఓపిక పడితే చాలు ఇంట్లో దర్జాగా కూర్చుని కొత్త సినిమాలు ఎంజాయ్ చేయొచ్చన్న సందేశం జనానికి నేరుగా వెళ్ళిపోతోంది.

నిన్న సెన్సేషనల్ ఓపెనింగ్ దక్కించుకున్న ఉప్పెన సినిమాకు థియేటర్లో అసలు టైటిల్ కార్డు పడకుండానే స్ట్రీమింగ్ సూన్ ఆన్ నెట్ ఫ్లిక్స్ అని వేసేయడం అందరిని షాక్ కి గురి చేసింది. మీడియా పార్టనర్ అని లోగో వేయడం వేరే ఇలా ప్రత్యేకంగా స్లయిడ్ ప్రదర్శించడం వేరు. అంటే అప్పటికే షోకు వచ్చిన ప్రేక్షకులకు బయటికి వెళ్ళాక తెలిసినవాళ్లకు హింట్ ఇవ్వండి అన్నట్టు ఉంది ఈ వ్యవహారం. ఏది ఏమైనా ఓటిటి గ్యాప్ చాలా తగ్గిపోతోంది. మల్టీ ప్లెక్సులతో వచ్చిన రెవిన్యూ వివాదం వల్ల అక్షయ్ కుమార్ సూర్యవంశీ కూడా సింగల్ స్క్రీన్లు, ఓటిటిలో ఒకేసారి విడుదల చేసే దిశగా నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు ఫ్రెష్ అప్ డేట్.