iDreamPost
android-app
ios-app

గంటా కేటీఆర్ ను ఎందుకు కలిశాడు ?

గంటా కేటీఆర్ ను ఎందుకు కలిశాడు ?

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తో శనివారం భేటీ అయ్యారు. తెలంగాణ‌ శాసన సభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్‌ను అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాసరావు క‌లిశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలపడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉండ‌గా, తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు అధికారం ద‌క్క‌కుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు ప్ర‌చారం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ల‌పై ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్పుడు తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు కేటీఆర్ ను క‌ల‌వ‌డం, విశాఖ‌కు రావాల‌ని స్వ‌యంగా ఆహ్వానం ప‌ల‌క‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read:తిరుపతికి కూడా సోమిరెడ్డే నా?మంచి గెలుపు ట్రాక్ రికార్డ్ ఉన్న నేతలే దొరకలేదా?

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయనను కలిసినట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రులతో కలిసి ఓ బృందంగా విశాఖకు వస్తామని కేటీఆర్ చెప్పినట్లు గంటా పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతానని గంటా ఆ సందర్భంగా ప్రకటించిన విష‌యం కూడా తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హ‌క్కు ఉద్య‌మం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మార్చి 11న తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. కేసీఆర్ ఆదేశిస్తే విశాఖ ఉక్కు ఉద్యమంలో ప్ర‌త్య‌క్షంగా పాల్గొంటామని పేర్కొన్నారు. ఈరోజు ఏపీలో అమ్ముతున్నారు..రేపు తెలంగాణలో అమ్మడం మొదలుపెడతారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కానివ్వబోమని చెప్పారు. కేంద్రం వైఖరికి నిరసనగా అవసరమైతే విశాఖలో పోరాటం చేస్తామని చెప్పారు.

Also Read:గుడ్ మార్నింగ్ చెప్పేందుకు మరికొందరు రెడీ!

కేంద్రం వైఖరికి నిరసనగా అందరూ పోరాడాలని పిలుపిచ్చారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుని ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు తెలుపుతామని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరిస్తే తమకు సంబంధం ఏంటి అనుకోమని తెలిపారు. ఇప్పుడు తాము పట్టించుకోకపోతే తెల్లారి మన దగ్గరకు వస్తారని చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల అనంత‌రం ఏపీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఉద్య‌మ‌కారులు క్షీరాభిషేకం చేశారు. ఈ క్ర‌మంలోనే గంటా శ్రీ‌నివాస‌రావు కేటీఆర్ ను క‌ల‌వ‌డం ఆస‌క్తిగా మారింది.