iDreamPost
iDreamPost
వల్లభనేని వంశీ వ్యవహారం కొలిక్కి వస్తోంది. వైసీపీలో ఆయన ప్రస్థానానికి అడ్డంకులు తొలగుతున్నట్టు కనిపిస్తోంది. నెల క్రితమే ముఖ్యమంత్రి జగన్ ని కలిసినప్పటికీ రాజకీయంగా ఉన్న ఇబ్బందులతో వంశీ ఊగిసలాటలో పడ్డారు. చివరకు ఓ అడుగు ముందుకేసి తాను జగన్ ప్రభుత్వానికి మద్ధతు పలుకుతున్నట్టు తేల్చేశారు. అదే సమయంలో టీడీపీ అధిష్టానాన్ని టార్గెట్ చేశారు. బాబు-చినబాబు మీద వంశీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. టీడీపీ క్యాంపులో కలకలం రేపాయి.
మరోవైపు వైసీపీలో కూడా అస్పష్టత కనిపించింది. ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు అసంతృప్తి చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి వెంకట్రావు నేరుగా సీఎంతో భేటీ అయ్యారు. వంశీ వైసీపీలో చేరితే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, వెంకట్రావు భవితవ్యంపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్ హామీతో వెంకట్రావుతో సంతృప్తి చెందినట్టుగా అనుచరులు చెబుతున్నారు. రాజకీయంగా కష్టకాలంలో తనకు తోడుగా ఉన్న వారందరికీ న్యాయం చేస్తున్నట్టుగానే వెంకట్రావుకి కూడా పార్టీలో గుర్తింపు ఉంటుందని జగన్ చెప్పినట్టు యార్లగడ్డ ముఖ్య అనుచరుడు ఒకరు తెలిపారు.
సమావేశం అనంతరం మంత్రులిద్దరితో కలిసి వెంకట్రావు నేరుగా గన్నవరం వెళ్లారు. దీంతో గన్నవరం రాజకీయాల్లో కొత్త మలుపులు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మూడు శిబిరాలుగా ఉన్న నేతల్లో ఇద్దరు వైసీపీ వైపు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి వర్గం మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి మద్ధతుగా నిలిచింది. ఇక ఇప్పుడు వల్లభనేని కూడా వైసీపీ కండువా కప్పుకుంటే గన్నవరంలో పాలకపక్షానికి పట్టు దొరికే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజకీయంగా కీలక నియోజకవర్గాలలో ఒకటయిన గన్నవరంలో ప్రస్తుతం గరంగరంగా ఉన్న వ్యవహారం త్వరలోనే ఫుల్ క్లారిటీ దిశగా సాగుతున్నట్టుగా భావిస్తున్నారు.