iDreamPost
android-app
ios-app

కారు బోల్తా – గ్యాంగ్‌స్టర్ ఫిరోజ్ అలీ దుర్మరణం

కారు బోల్తా – గ్యాంగ్‌స్టర్ ఫిరోజ్ అలీ దుర్మరణం

మీకు గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే గుర్తున్నాడా?.. కరుడుగట్టిన నేరస్తుడైన వికాస్ దూబే ను ఉత్తర ప్రదేశ్ కు తీసుకువెళ్తున్న వాహనం బోల్తా పడటంతో అతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇంచుమించు అలాంటి సంఘటన మరోసారి జరిగింది. కానీ కాస్త భిన్నంగా జరిగింది. కానీ ఈసారి మరణించింది మాత్రం గ్యాంగ్‌స్టర్ ఫిరోజ్ అలీ..

వివరాల్లోకి వెళితే సుమారు పదికి పైగా దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ ఫిరోజ్ అలీని ముంబై నుండి ఉత్తర ప్రదేశ్ కు తరలిస్తుండగా కారు ప్రమాదానికి గురి కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో గ్యాంగ్‌స్టర్ ఫిరోజ్ అలీ మరణించగా కారు డ్రైవర్ తో పాటుగా నలుగురు పోలీసులు గాయపడ్డారు. ముంబైలోని నలసోపారా ప్రాంతంలోని మురికివాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఫిరోజ్ ఇంటిపై లక్నో పోలీసు బృందం శనివారం దాడి చేసింది. అనంతరం ఫిరోజ్ అలీతో పాటు అతడి బంధువును కూడా అదుపులోకి తీసుకుంది.

వీరిని పోలీసులు అరెస్ట్ చేసి ఉత్తరప్రదేశ్ కు తీసుకువెళ్తున్న క్రమంలో కారు మధ్యప్రదేశ్ లోని గున జిల్లాలోని జాతీయ రహదారి 46 వద్ద ఒక ఎద్దు అడ్డం రావడంతో కారు బోల్తా పడినట్లు ఫిరోజ్ అలీ అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు పోలీసులు గాయపడినట్లు లక్నో పోలీసు కమిషనర్ సుజీత్ పాండే వెల్లడించారు. కాగా ఈ ఘటనపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

సత్వర న్యాయం జరగాలి అంటే కోర్టుల ద్వారా జరగాలని కొందరు వ్యాఖ్యానిస్తుండగా మరికొందరు మాత్రం గ్యాంగ్‌స్టర్ లు సమాజానికి చీడ పురుగులని వాళ్ళని అంతం చేస్తేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైన సత్వర న్యాయం దిశలో పోలీసులు, వ్యవస్థలు,ప్రభుత్వాలు తీసుకున్న చర్యల్లో కథలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. కొన్నిసార్లు వాహనాలు బోల్తా పడుతుంటాయి.. గ్యాంగ్‌స్టర్లు మరణిస్తూ ఉంటారు..