iDreamPost
android-app
ios-app

గణేష్ ఉత్సవాలు – కేరళ, కర్ణాటక అనుభవాలు ఏం చెబుతున్నాయి..?

  • Published Sep 04, 2021 | 9:49 AM Updated Updated Sep 04, 2021 | 9:49 AM
గణేష్ ఉత్సవాలు – కేరళ, కర్ణాటక అనుభవాలు ఏం చెబుతున్నాయి..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి సందర్భంగా కోవిడ్ అమలు చేయాలని నిర్ణయించింది. గణేష్ మండపాల నిర్వహణ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సంకల్పించింది. ఇప్పటికే కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ ల కారణంగా రాష్ట్రంలో అపార నష్టం సంభవించింది. అనేక కుటుంబాలను ఇక్కట్లు పాలుజేసింది. అదే సమయంలో థర్డ్ వేవ్ ప్రకటనలు కూడా వస్తున్నాయి. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రభావం ఉండొచ్చనే అంచనాలను వివిధ విభాగాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు వేస్తన్నారు. అలాంటి సమయంలో థర్డ్ వేవ్ ముంగిట మళ్లీ ఇబ్బందులు కొనితెచ్చుకోకూడదనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం గణేష్ ఉత్సవాల నిర్వహణ కోసం మండపాల విషయంలో అనుమతులు తీసుకోవాల్సిందేననే కండీషన్ పెట్టింది. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పూజలు చేసుకోవాలని సూచించింది.

సహజంగా జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వివాదాస్పదం చేయడం ద్వారా పబ్బం గడుపుకునే లక్ష్యంతో ఉన్న సెక్షన్ ఇప్పుడు కూడా సిద్ధమయ్యింది. పైగా మత విశ్వాసాలను ముడిపెట్టి విమర్శలకు పూనుకుంటోంది. అయితే కేరళ, కర్ణాటక అనుభవాలను గమనిస్తే ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులున్నాయన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలకు కారణాలు అర్థమవుతాయి. అన్నింటినీ జగన్ కి ముడిపెట్టేసి, నిందలతో మనుగడ సాగించాలనే ప్రయత్నాల్లో ఎంత అసంబంధ్ధత ఉందన్నది స్పష్టమవుతుంది.

Also Read : దుష్ప్ర‌చారంపై జ‌గ‌న్ స్వీట్ కామెంట్స్

కేరళలో ఓనం సందర్భంగా ప్రభుత్వం స్వల్పంగా ఆంక్షలు సడలించింది. దానికి ముందు మొహర్రం సమయంలోనూ ఇదే రీతిలో వ్యవహరించింది. మత సంస్థల ఒత్తిడితో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా కేరళ కకావికలమయ్యింది. ఫస్ట్, సెకండ్ వేవ్ నుంచి సునాయాసంగా గట్టెక్కిన రాష్ట్రంలో కోవిడ్ కేసులు అమాంతంగా పెరిగాయి. చివరకు దేశమంతా వస్తున్న కరోనా పాజిటివ్ కేసుల కన్నా ఒక్క కేరళలోనే ఎక్కువగా నమోదుకావడం గమనిస్తే పరిస్థితి అర్థమవుతుంది. అయితే అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల ఎక్కువ మందికి ప్రాణాపాయం లేకుండా గట్టెక్కుతున్నారు. కానీ పెరుగుతున్న కోవిడ్ కేసులు మాత్రం కేరళ రాష్ట్రంలో అందరినీ కలవరపరుస్తోంది.

కర్ణాటకలో కూడా కోవిడ్ తీవ్ర తగ్గుముఖం పడుతున్నా ముప్పు తొలగలేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కర్ణాటక బీజేపీ సర్కారు కూడా వినాయకచవితి ఉత్సవాలపై పలు ఆంక్షలు పెట్టింది. ముఖ్యంగా బహిరంగా మండపాల ఏర్పాటు వద్దని చెబుతోంది. వినాయకచవితి ఉత్సవాలను ఇళ్లల్లో జరుపుకోవాలని సూచిస్తోంది. పండుగల పేరుతో మళ్లీ ప్రజలంతా గుమికూడితే సమస్య వస్తుందనే అభిప్రాయం కర్ణాటక బీజేపీ ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. అందుకు తగ్గట్టుగా బెంగళూరు పోలీసులు గణేష్ మండపాల నిర్వాహకులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

సాటి దక్షిణాది రాష్ట్రాల్లోనే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే దేశవ్యాప్తంగా అన్ని చోట్లా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించడానికి, దానికి కూడా మతరాజకీయం చేసేందుకు వాడుకుంటున్న తీరు విస్మయకరంగా ఉంది. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తుకి అంత శ్రేయస్కరం కాదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో వివిధ పండుగలను ఇళ్లల్లోనే జరుపుకున్న అనుభవాలు మరచిపోకూడదని, మళ్లీ ఇష్టారాజ్యంగా వీధుల్లో గుమికూడితే కలిగే నష్టం లెక్కలేనంతగా ఉండొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు. ఏమయినా ప్రతీ విషయాన్ని మతానికి ముడిపెట్టే వారితో కొంత జాగ్రత్త అవసరం అనే విషయం మాత్రం అందరూ గుర్తించాల్సి ఉంది.

Also Read : సీఎం సీటు సేఫ్…కరోనా గిరోనా జాన్తా నై, మమత పాలిటిక్స్…!