iDreamPost
iDreamPost
నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించే విషయంలో అపసోపాలు పడుతున్న టీడీపీ అధిష్టానం విశాఖ దక్షిణ నియోజకవర్గం విషయం కార్యకర్తల అభీష్టానికి విరుద్ధంగా ముందుకు వెళుతోందన్న అసంతృప్తి కార్యకర్తల్లోనే వ్యక్తం అవుతోంది. కార్యకర్తలు ఒక నేత వైపు మొగ్గు చూపుతుంటే.. దాన్ని కాదని పార్టీ అధినేత వేరే నియోజకవర్గ నేతను వారిపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో విజయవాడలో అధినేత చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ఈ సంకేతాలు వెలువడ్డాయంటున్నారు. తన మనసులో ఉన్నదానికి విరుద్ధంగా కార్యకర్తలు చెప్పడంతో తర్వాత నిర్ణయం ప్రకటిస్తామంటూ సమావేశాన్ని ముగించారు.
ఏడాదిగా ఇంఛార్జి లేరు
సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నగరంలో టీడీపీ గెలిచిన నాలుగు నియోజకవర్గాల్లో విశాఖ దక్షిణం ఒకటి. ఆ పార్టీ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తర్వాత కాలంలో వైఎస్సార్సీపీకి దగ్గరయ్యారు. దాంతో టీడీపీకి నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. ఈ పరిస్థితుల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ కొంతవరకు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో నియోజక ఇంఛార్జి నియామక ప్రక్రియకు పార్టీ అధినేత శ్రీకారం చుట్టారు. నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలను విజయవాడ పిలిపించి అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ సమావేశానికి నజీర్ తోపాటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూడా హాజరయ్యారు. కాగా ఎక్కువ మంది నజీర్ ను ఇంఛార్జిగా నియమించాలని సూచించారు. కానీ చంద్రబాబు గండి బాబ్జీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అందుకనే ఆయన్ను కూడా సమావేశానికి పిలిచారు. అయితే కార్యకర్తలు, నాయకులు నజీర్ పేరు సూచించడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. వారి అభీష్టానికి విరుద్ధంగా అక్కడికక్కడే నిర్ణయం ప్రకటిస్తే విపరిణామాలు ఎదురవుతాయన్న ఉద్దేశంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే ఎవరిని నియమించినా అంగీకరిస్తామన్న హామీని మాత్రం కార్యకర్తల నుంచి తీసుకున్నారు.
బాబ్జీపై ఎందుకంత మొగ్గు
మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆయనది పెందుర్తి నియోజకవర్గం. అయితే అక్కడ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ ఉన్నారు. ఆయన్ను కాదని గండి బాబ్జీకి టికెట్ ఇచ్చే పరిస్థితి అప్పట్లో లేదు. భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామన్న హామీతో బాబ్జీని పార్టీలో చేర్చుకున్నారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా బండారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఈసారి టికెట్ తనకేనని గండి బాబ్జీ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ వివాదం అధినేత దృష్టికి కూడా వెళ్లింది. ఒకరికి పెందుర్తి, మరొకరికి వేరే నియోజకవర్గంలో అవకాశం ఇస్తామని చంద్రబాబు సూచించినా వారు అంగీకరించలేదు. ఇద్దరూ పెందుర్తి కోసమే పట్టుబట్టారు. అయితే చివరికి ఎలాగోలా ఖాళీగా ఉన్న విశాఖ దక్షిణ ఇంఛార్జి పదవి తీసుకునేలా బాబ్జీని ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే కార్యకర్తలు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ వైపు ఉండటంతో చంద్రబాబు ప్లాన్ ప్రస్తుతానికి వర్కౌట్ కాలేదు.
Also Read : జగన్ ఎజెండా అమలుచేస్తున్న చంద్రబాబు