iDreamPost
android-app
ios-app

Galla jayadev – టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మౌనం వెనక కారణం ?

  • Published Dec 14, 2021 | 7:02 AM Updated Updated Mar 11, 2022 | 10:31 PM
Galla jayadev – టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మౌనం వెనక కారణం ?

న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట సాగుతున్న యాత్ర ఆధ్యంతాలలో ఎక్కడా కానరాని రాజధాని ప్రాంత ఎంపీ .

గతంలో తన కంపెనీల పై కేసుల విషయంలో కొందరు టీడీపీ నేతలు , ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన అతే కారణమంటూ కొందరు నేతలు వ్యాఖ్యలు .

కాంగ్రెస్ ని వీడి టీడీపీలో చేరిన మాజీ మంత్రి జయదేవ్ మాతృమూర్తి గల్లా అరుణకుమారి కూడా దీర్ఘ కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరం .

తాత్కాలికంగా మౌనం వహించారా , పార్టీని పూర్తిగా దూరం పెట్టారా అంటూ అంతర్మథనంలో టీడీపీ నాయకత్వం ..

న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ అమరావతి పరిరక్షణ పేరిట గుంటూరులో ప్రారంభించిన యాత్ర చిత్తూరు జిల్లా తిరుపతిలో ముగియనుంది . ఈ రెండు ప్రాంతాల్లోనూ కీలకమైన నేత గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఎంపీ , చిత్తూరు వ్యాపారవేత్త గల్లా జయదేవ్ మాత్రం ఈ యాత్రకు పూర్తిగా దూరంగా ఉన్నారు . యాత్రకు మాత్రమే కాదు ఇటీవల టీడీపీకి సంభందించిన ఏ కార్యక్రమంలో కూడా గల్లా కనిపించలేదు . ఆయన ప్రస్తావన వినబడలేదని చెప్పొచ్చు . టీడీపీ అధినాయకుడు అసెంబ్లీలో మాట్లాడుతూ తాను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యిన తరువాతే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసిన తర్వాత టీడీపీలోని చాలా మంది ఛోటామోటా నేతలు మిమ్మల్ని మళ్లీ సీఎం చేస్తాము సర్ అంటూ సంఘీభావం ప్రకటించిన సందర్భంలో సైతం గల్లా సహా కొందరు బడా నాయకులు నోరు విప్పకపోయినా ప్రత్యేకించి గల్లా విషయంలో టీడీపీ ఆందోళన చెందుతోంది .

అమరావతి ఉద్యమ ప్రారంభంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో గల్లా మాట్లాడుతూ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ అమరావతిని కాపాడమని ఆంగ్లంలో చేసిన ప్రసంగానికి టీడీపీ నేతలు జేజేలు పలకటమే కాక తిరిగి వచ్చాక పాలాభిషేకాలు సైతం చేసి ఉద్యమ నాయకునిగా అగ్రతాంబూలమిచ్చారు . ఆ తరువాత కూడా అదే వేగం కొనసాగించిన గల్లా ఢిల్లీ వేదికగా పలుమార్లు అమరావతి ఉద్యమ ప్రస్తావన తేవడమే కాకుండా అమరావతి ఉద్యమకారులను , కొందరు మహిళలను తనతో ఢిల్లీ తీసుకువెళ్లి పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి అమరావతికి మద్దతు అంటూ హంగామా చేశారు .

స్థానికంగా అమరావతి పరిరక్షణ పేరిట పుట్టగొడుగుల్లా వెలిసిన సమితులు ,కమిటీల ఏర్పాటు , నిర్వహణల వెనుక ఉండి కీలకంగా చక్రం తిప్పిన గల్లా జయదేవ్ అసెంబ్లీ ముట్టడి సందర్భంగా హౌస్ అరెస్ట్ నుండి పోలీసుల కళ్ళు గప్పి ఆందోళనలో పాల్గొని అరెస్ట్ కూడా అయ్యారు . ఇంత క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా మౌనం వహించి దాదాపు ఆర్నెల్లు గడుస్తోంది . ఎందుకిలా జరిగిందో అని ఓ వైపు పార్టీలో శ్రేణులు అంతర్గతంగా వివిధ ఊహాగానాలు చేస్తుండగా , మరోవైపు పార్టీ అగ్రనాయకత్వం ఆయన్ని క్రియాశీలకం చేసే ప్రయత్నాలు గల్లా స్పందన లేక విఫలం అవుతున్నాయి .

ఎందుకిలా , ఒక్కసారిగా గల్లా మౌనం వహించడం వెనక కారణమేంటి అని తరచి చూస్తే కొందరు టీడీపీ నేతల అత్యుత్సాహం , ఏబీఎన్ రాధాకృష్ణ వక్రభాష్యాలు ప్రధాన కారణం అన్నది తేటతెల్లం అవుతుంది .

కొద్ది నెలల క్రితం గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా కంపెనీ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిలివేయాలని , ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యం తగ్గించే చర్యలు తీసుకోని పక్షంలో కంపెనీ తరలించాలని అటవీ పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేయగా ఈ అంశం పై అమరరాజా కంపెనీ యాజమాన్యం కోర్టుని ఆశ్రయించారు . కోర్టులో ప్రభుత్వం తరపున కాలుష్య నియంత్రణ మండలి వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకొని సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది .

ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకోకుండా , వాస్తవాల్ని వక్రీకరించిన టీడీపీ నేతలు , ఇది వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని , టీడీపీకి చెందిన వ్యాపారస్తులను ఆర్థికంగా కూలదోయటానికి ప్రభుత్వమే ఇలా అక్రమకేసులు పెట్టి వేధిస్తోందని పలు వేదికల సాక్షిగా తీవ్ర దుష్ప్రచారం చేశారు . ఏబీఎన్ రాధాకృష్ణ , నటుడు గరుడ పురాణం శివాజీ మరో అడుగు ముందుకేసి సామాజిక వర్గ ప్రాతిపదికన కమ్మ వారి వ్యాపారాలను వైసీపీ టార్గెట్ చేసిందని , వైసీపీ ప్రభుత్వ దుర్మార్గ చర్యల వలన వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమరరాజా కంపెనీ చెన్నై తరలివెళుతుందని దాదాపు నెల రోజుల పాటు ప్రచారంతో హోరెత్తించారు .

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎక్కడా నోరు విప్పని గల్లా జయదేవ్ తన కంపెనీ వార్షికోత్సవ సభలో మీడియాతో మాట్లాడుతూ తమ కంపెనీ ఎక్కడికీ తరలిపోవట్లేదని రెడ్ లిస్టులో ఉండే కంపెనీలకు ఇలాంటి నోటీసులు సాధారణం అని , కోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని సమస్యని పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు .

కొందరు టీడీపీ నేతలు , నటుడు శివాజీ ఆరోపణలు , ఏబీఎన్ రాధాకృష్ణ తరలింపు వార్తా కథనాల గురించి ప్రస్తావించగా అవన్నీ తమ ప్రమేయం లేకుండా వచ్చిన అసత్య కథనాలని , ప్రభుత్వం తమని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టలేదన్న గల్లా కోర్టు పరిధిలో ఉన్న సున్నితమైన అంశమైనందున ఇంతకన్నా వ్యాఖ్యానించలేనని తేల్చి చెప్పారు .

ఈ వ్యవహారం తర్వాత ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో కనపడని గల్లా కొందరు సన్నిహితులతో మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం , వైసీపీ పై ఆరోపణలు చేయడం కోసం టీడీపీ , ఆంధ్రజ్యోతి కలిసి సంభందం లేని విషయాల్లో తన పేరు , తన కంపెనీ పేరు లాగి అల్లరి చేసి అప్రతిష్ట పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారని అందువలనే అలక వహించిన గల్లా టీడీపీకి పూర్తిగా దూరం జరిగారని పలువురు టీడీపీ నేతలు అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానించడం గమనార్హం .