ప్రతిపక్ష టీడీపీ పరిస్థితి రాష్ట్రంలో రోజురోజుకూ దిగజారుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణాలో జెండా పీకేసిన పార్టీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇంచుమించుగా అటువంటి స్థితికే చేరుతున్నట్టు కనిపిస్తోంది.
పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మినహా ఇతర నేతలెవ్వరూ ప్రజల్లో కనిపించడం తగ్గించేశారు. మీడియాలో వినిపించడం కూడా ఏదో ఒకరిద్దరు మినహా ఎవరూ లేరు.
పార్టీకి ఉన్న పార్లమెంటు సభ్యుల సంఖ్య సగానికి పడిపోయింది. ఒకరిద్దరు పదవీవిరమణ చేయగా ముగ్గురు ఎంపీలు బీజేపీలోకి చేరిపోయారు. ఇప్పుడు టీడీపీకి మిగిలింది లోక్ సభలో ముగ్గురు, రాజ్యసభలో ఒక్కరు. ఈ ముగ్గురిలో కూడా ఐకమత్యం ఉన్నట్టు కనిపించడం లేదు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి దూరం అయినట్టు కనిపిస్తోంది. అధినాయకత్వాన్ని కేశినేని పట్టించుకోవడం లేదు. పార్టీ అధినాయకత్వం కూడా కేశినేనిని పట్టించుకోవడం తగ్గించేసింది. పైగా కేశినేనికి వ్యతిరేక వర్గాన్ని విజయవాడలో ప్రోత్సహిస్తోంది.
ఇక కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్టీలో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తనకు రావలసిన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాబాయి అచ్చెన్నాయుడు కాజేసాడనే బాధ ఇటీవల ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడాన్ని బట్టి అర్ధం అవుతోంది.
పార్టీకి మిగిలిన మూడో ఎంపీ గల్లా జయదేవ్. సుజనా చౌదరి పార్టీని వీడిన తర్వాత పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు జయదేవ్ కు అప్పగించారు చంద్రబాబు. అయితే కొత్త బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ళలో లోక్ సభలో కాస్త ఉత్సాహంగా కనిపించిన జయదేవ్ ఆ తర్వాత చప్పబడ్డారు. పార్టీ కార్యక్రమాలు బాగా తగ్గించేసుకున్నారు.
ఇటీవల ముగిసిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఇటు కేశినేని, అటు రామ్మోహన్ నాయుడు ఎంతో కొంత పనిచేసినా, జయదేవ్ మాత్రం తన గుంటూరు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.
ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మొదలయ్యాయి. కేశినేని ఇప్పటికే విజయవాడ నగర పాలక సంస్థతో పాటు తన నియోజక వర్గంలోని జగ్గయ్యపేట, నందిగామ మున్సిపాలిటీలు, తిరువూరు నగర పంచాయితీ ఎన్నికల్లో చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఏకంగా తన కుమార్తెను రంగంలోకి దింపి గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. మరోవైపు రామ్మోహన్ నాయుడు కూడా తన పరిధిలోని పంచాయితీలపై ద్రుష్టి పెట్టి పనిచేస్తున్నారు.
కానీ జయదేవ్ ఇప్పటికీ గుంటూరు పరిసరాల్లోకి రాలేదు. గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీలో అంతర్గత పోరు తీవ్రంగా కనిపిస్తోంది. ఒకరిద్దరు పార్టీ నేతలు నాయకత్వంపై ఎదురు తిరిగి రెబెల్స్ గా రంగంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తొంగి చూసేందుకు కూడా జయదేవ్ ప్రయత్నం చేయలేదు.
గత ఎన్నికల్లో జయదేవ్ కు ప్రత్యర్థిగా నిలిచిన మోదుగుల వేణుగోపాలరెడ్డి నగరంలో జయదేవ్ కు తీవ్ర వ్యతిరేకతను కూడగట్టగలిగారు. ఈ పరిస్థితుల్లో గుంటూరును స్వంతం చేసుకోవాల్సిన జయదేవ్ నగరానికి, నాయకులకు, కార్యకర్తలకు దూరంగా ఉండడం ఎందుకో అర్ధం కావడం లేదు. గత యేడాదిగా కోవిడ్ కారణంగా ఇళ్ళకే పరిమితమైన టీడీపీ నేతలు ఆ పద్దతిని ఇప్పటికీ కొనసాగించడం, ప్రజలకు, కార్యకర్తలకు దూరంగా ఉండడంతో కార్యకర్తలను ఒక్కతాటిపై నడిపించే నేతలు లేకుండా పోయారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయగల నేతలు లేకపోవడం టీడీపీకి ఇప్పుడు కనిపిస్తున్న పెద్దలోటు. దీనికి తోడు జయదేవ్ లాంటి నేతలు ఎన్నికల్లో కూడా పాల్గొనకపోవడం, పోటీ చేస్తున్న అభ్యర్థులకు అండగా అందుబాటులో ఉండకపోవడం ఆ పార్టీ భవిష్యత్తును ప్రశ్నర్ధకం చేస్తున్నాయి.
పైగా జయదేవ్ ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వంతో సంబంధాలు మెరుగు పర్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా తో కూడా జయదేవ్ మంచి సంబంధాలే నెరపుతున్నారు. చంద్రబాబును దూరంగా పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం ఒక్కొక్కరుగా టీడీపీ నేతలను దగ్గరకు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే జయదేవ్ టీడీపీకి చంద్రబాబుకు దూరంగా, బీజేపీకి దగ్గరగా జరిగినట్టు కనిపిస్తోంది. అందువల్లనే జయదేవ్ పంచాయతీ ఎన్నికలకే కాదు మున్సిపల్ ఎన్నికలకు కూడా అందుబాటులో లేకుండా పోయారని గుంటూరులో టీడీపీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు.