iDreamPost
android-app
ios-app

మార్కెట్ రాజ‌కీయం.. ఇరు పార్టీల మ‌ధ్య దుమారం..!

మార్కెట్ రాజ‌కీయం.. ఇరు పార్టీల మ‌ధ్య దుమారం..!

అది పేరుకు ఒక మార్కెట్ మాత్ర‌మే.. కానీ దానికి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ మార్కెట్ వేదిక‌గా సాగుతున్న రాజ‌కీయం రెండు ప్ర‌ధాన పార్టీ మ‌ధ్య అగ్గి రాజేస్తోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను పెద్ద అంబర్‌పేట మండలం కోహెడ గ్రామానికి తరలించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్‌ కేవలం 22 ఎకరాల్లోనే ఉంది. మార్కెట్ కోసం కోహెడలో 178.09 ఎకరాల విస్తీర్ణం గల భూమిని గుర్తించింది. అక్కడ అన్ని హంగులతో విశాలమైన మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ద‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ.. క‌రోనా నేప‌థ్యంలో మార్కెట్ ను త‌ర‌లించేందుకు కోహెడ‌లో చ‌క‌చ‌కా ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద గాలి, వాన‌కు మూడు రోజుల్లోనే ఆ షెడ్లు కూలిపోయాయి. దాదాపు 20 మందికి పైగా కార్మికులు గాయాల‌పాల‌య్యారు. దీంతో అక్క‌డ‌కు వెళ్లేందుకు కొంద‌రు వ్యాపారులు, క‌మీష‌న్ వ్యాపారులు స‌సేమిరా అంటున్నారు. అక్క‌డ పూర్తి స్థాయి సౌక‌ర్యాలు ఏర్పాటు చేసే వ‌ర‌కూ త‌ర‌లేది లేద‌ని అంటున్నారు. దీంతో మార్కెట్ త‌ర‌లింపుపై అధికార వ‌ర్గాలు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి.

రేవంత్ రెడ్డి ప్ర‌వేశంతో…

కొంద‌రు వ్యాపారుల కోరిక మేర‌కు ఇటీవ‌ల ఆ మార్కెట్ ను ఎంపీ రేవంత్ రెడ్డి సంద‌ర్శించారు. గ‌తంలో కోహెడ మార్కెట్ కూలిన‌ప్పుడు కూడా రేవంత్ అక్క‌డ‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గడ్డిఅన్నారం నుంచి మార్కెట్‌ను కోహెడకు మార్చడం వెనుక కుట్ర ఉందని, ఇది పెద్ద కుంభకోణమని ఆరోపించారు. తక్షణమే ఇందుకు సంబంధించిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల కన్నుపండ్ల మార్కెట్ భూములపై పడిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్ని రేపాయి. టీఆర్ఎస్ నేత‌లు రంగంలోకి దిగారు. కొంద‌రు వ్యాపారుల ఆదాయం పెంపే ల‌క్ష్యంగా రేవంత్ ఆలోచిస్తున్నారు కానీ.. రైతుల ఆరోగ్యాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రేవంత్ పై నిప్పులు కురిపించారు.

రేవంత్ చీక‌టి ఒప్పందాలు అంటూ…

రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌తో మార్కెట్ విష‌యంలో రాజ‌కీయ వేడి పెరిగింది. ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే, మూసీ రివ‌ర్ ప్రంట్ చైర్మ‌న్ సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో రేవంత్ పై ఆరోప‌ణ‌లు చేశారు. మార్కెట్ త‌ర‌లింపు ప్ర‌తిపాద‌న ఇప్ప‌టిది కాద‌ని, ప‌దేళ్ల క్రితం నాటిద‌ని అన్నారు. తాను ఎమ్మెల్యేగా అయిన త‌ర్వాత రైతుల సౌక‌ర్యార్థం మార్కెట్ త‌ర‌లింపును వేగ‌వంతం చేశాన‌న్నారు. మార్కెట్‌లో పెద్ద ఎత్తున పండ్ల క్రయవిక్రయాలు జరుగుతాయని, వేలాదిమంది వచ్చిపోతుంటారన్నారు. ట్రాఫిక్‌ చిక్కులు, కరోనా వైరస్‌ భయంతో పండ్ల మార్కెట్‌ను కోహెడ తరలించాలని పాలకవర్గం తీర్మాణం చేసిందన్నారు. దీన్ని రాజ‌కీయం చేయ‌డానికి రేవంత్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. మార్కెట్ త‌ర‌లింపును అడ్డుకోవ‌డానికి రేవంత్ రెడ్డి ఏ వ్యాపారుల‌తో చీక‌టి ఒప్పందాలు చేసుకున్నారోన‌ని ఆరోపించారు. ఇరు పార్టీల నేత‌ల మాట‌ల యుద్ధం మార్కెట్ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.