సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో కన్నుల పండగగా జరిగింది. కానీ ఈవెంట్ మొత్తానికి హైలెట్ గా నిలిచింది మాత్రం చిరంజీవి, విజయశాంతి జంట చేసిన సందడే.. చిరంజీవి,విజయశాంతి జంటగా 1991లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంగ్ లీడర్ లో “సండే అననురా- మండే అననురా” పాటను గుర్తుచేసుకుంటూ చిరంజీవి విజయశాంతిపై ఛలోక్తులు విసరడంతో ఈవెంట్ లో పాల్గొన్న అందరిలోను నవ్వులు విరిశాయి. ఆ తరువాత కూడా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో అనేక ఛలోక్తులు ఉండటంతో ఈవెంట్ కి వచ్చిన ప్రతి అభిమాని ఆనందంతో పొంగిపోయారు.
అసలు ఈవెంట్ చేసింది మహేష్ బాబు సినిమా కోసం అయితే, ఆ ఈవెంట్ కాస్త చిరంజీవి విజయశాంతి తమ మనస్పర్థలు తొలగించుకునే వేదికగా మారిపోవడం వల్ల ఈవెంట్ వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయంగా చిరంజీవిపై సూటిగా విమర్శలు చేసింది విజయశాంతి. అలా విమర్శలు చేయడం వల్ల చిరంజీవి,రాములమ్మల మధ్య దూరం పెరిగింది. కానీ చిరంజీవి వాటిని పక్కన పెట్టి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో ఈవెంట్ స్టేజ్ పై నవ్వులు విరిశాయి. దానికి తోడు వారిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు తీసేసినట్లయింది.
ఇదంతా ఒక ఎత్తైతే ఈవెంట్ ముగిసిన తర్వాత చిరంజీవి విజయశాంతి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణను ఆధారంగా చేసుకుని సోషల్ మీడియాలో చేసిన memes అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా చిరంజీవిని విజయశాంతిని కలపడానికే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్ ని ఏర్పాటు చేసాడని కొందరు memes రూపొందిస్తే, మరికొందరు మాత్రం “బాబు దిద్దిన కాపురం” అంటూ తమ క్రియేటివిటీ కి పని చెప్పారు. నన్ను అన్నేసి మాటలు ఎలా అన్నావ్ శాంతి అని చిరంజీవి నేరుగా అడిగిన మాటలను కూడా ఫన్నీ meme గా మార్చేశారు కొందరు.. “డివైడెడ్ బై పాలిటిక్స్ యునైటెడ్ బై సినిమా” అంటూ సినిమా మరికొన్ని memes వచ్చాయి. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు. చిరంజీవి విజయశాంతి గెట్ టుగెదర్ పార్టీలా ఉందంటూ ఫన్నీ meme మేకర్స్ memes తయారు చేసారు.
నిన్న జరిగిన సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ పుణ్యమా అని meme మేకర్స్ కి తమ క్రియేటివిటీ చూపించడానికి చేతినిండా పని దొరికింది. దానితోబాటే సోషల్ మీడియాలో కావాల్సినంత వినోదం కూడా పండింది.