Idream media
Idream media
ఉత్తరప్రదేశ్ సర్కారు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల సంఖ్య 32000కు దాటడంతో అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించనుంది. ఈ మేరకు యూపీ సీఎం కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 13 వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. 55 గంటల పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందన్నారు. అలాగే.. రైళ్లు, విమాన సర్వీసులకు మాత్రం అనుమతి ఉందన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. వలస కూలీల కోసం రూపొందించిన ‘ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్’ పథకం ప్రారంభ సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడి ప్రజలతో మాట్లాడారు. ప్రపంచంలోని బలైమైన దేశాలు సైతం కట్టడి చేయలేని మహమ్మారిని యూపీ వాసులు కచ్చితంగా ఎదుర్కొంటున్నారని, అందుకే ఇక్కడ మరణాల రేటు తక్కువగా ఉందని చెప్పారు. అయినా ఎవరూ చనిపోకుండా, వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా నడుచుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని వివరించారు. కరోనా కాలంలో యూపీ ప్రభుత్వం అత్యంత ధైర్య సాహసాలతో పని చేసిందని, కరోనాతో పోరాడుతోందని మోడీ కితాబు ఇచ్చారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముందుంటారని అన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ లాక్ డౌన్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.