iDreamPost
iDreamPost
ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ కె.ఎల్.రాహుల్ సెంచరీ… ఓపెనింగ్ భాగస్వామ్యం సెంచరీ దాటడంతో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. సఫారీ గడ్డపై భారత్ బ్యాట్స్‌మెన్‌లు సత్తా చాటారు. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో తొలి టెస్టు ఆదివారం ఆరంభమైంది. భారత్ ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు సాధించింది. కె.ఎల్. రాహుల్ సెంచరీ సాధించాడు. 122 పరుగులు (17×4, 1×6) చేసి నాటౌట్‌గా నిలిచాడు.
భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మైదానంపై పచ్చిక ఉండడంతో తొలి సెషన్‌లో ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని తెలిసి కూడా భారత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం. కెప్టెన్ కోహ్లి ఆశించినట్టుగానే భారత్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లు కె.ఎల్.రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు అదరగొట్టారు. వీరిద్దరూ 117 పరుగుల తొలివికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ చూడచక్కని ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. జట్టు స్కోర్ 52 పరుగుల వద్ద ఉన్న సమయంలో లైఫ్ వచ్చినా పెద్దగా వినియోగించుకోలేకపోయాడు. అగర్వాల్ 60 పరుగులు చేసి (9×4) ఎల్.ఎన్‌గిడి బౌలింగ్‌లో ఔటయ్యాడు.
అనంతరం బ్యాటింగ్ వచ్చిన పుజారా తొలి బాల్ కే అవుట్ కావడంతో భారత్ 117 పరుగుల వద్ద రెండవ వికెట్ కూడా కోల్పోయి కష్టాలలో పడింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ కోహ్లి వికెట్‌ను కాపాడుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ సమయంలో రాహూల్ చెలరేగి ఆడడంతో భారత్ స్కోర్ పెరుగుతూ వచ్చింది. రాహూల్ కు 60 పరుగుల వద్ద లైఫ్ రావడం విశేషం. అయితే కొహ్లి కుదురుకుంటున్న సమయంలో ఔటయ్యాడు. కొహ్లి 35 పరుగులు (4×4) చేసి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రహానే బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోర్ పరిగెత్తించారు. తొలిరోజు ఆటముగిసే సమయానికి రహానే 40 పరుగులు (8×4)తో నాటౌట్‌గా నిలిచాడు. భారత్ తరపున ఇంకా పంత్, అశ్విన్ వంటి వారు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఎన్‌గిడి ఒక్కడే రాణించి మూడు వికెట్లు పడగొట్టడం విశేషం.