ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర సమరయోధురాలు, తామ్రపత్ర గ్రహీత రూపాకుల విశాలాక్షి (94) అస్తమించారు. కొద్ది రోజులుగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విశాలాక్షి గురువారం ఉదయం 11.44 గంటలకు మరణించారు. ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం మహారాణిపేటలోని స్వగృహంలో ఉంచారు. విశాఖపట్నం మహారాణిపేటవాసి శిష్ట్లా దక్షిణామూర్తి, సీతామహాలక్ష్మి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతతిలో నాలుగో సంతానంగా విశాలాక్షి 1926 ఏప్రిల్ ఆరో తేదీన జన్మించారు. తండ్రి దక్షిణామూర్తి స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, స్వదేశీ ఉద్యమం వంటి పలు ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, మహాత్మాగాంధీ పిలుపు మేరకు చిన్నవయసులోనే ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రూపాకుల రామకృష్ణయ్య కుమారుడు సుబ్రహ్యణ్యాన్ని 1935వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అప్పటికే స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకుంటున్న భర్త, మామల అడుగుజాడల్లో నడిచారు.