Idream media
Idream media
వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించాలన్న అంశంపై జగన్‌సర్కార్ క్లారిటీ ఇచ్చినా.. టీడీపీ మాత్రం విమర్శలు చేయడం మానడంలేదు. పంపు సెట్లకు మీటర్లు ఎందుకు బిగించాల్సి వస్తుంది..? దాని వలన లాభాలు ఏమిటి..? అనేది వివరిస్తూ, ఉచిత విద్యుత్ శాశ్వతం అని ప్రభుత్వ పెద్దలు చెప్పడమే కాదు.. అపోహలు, అసత్య ప్రచారాలు నమ్మవద్దని, అనుమానాలను రాతపూర్వకంగా నివృత్తి చేస్తూ ఆదివారం పత్రికలకు ప్రకటనలు కూడా జారీ చేశారు.
దేశంలోనే ప్రప్రథమంగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడంలో ఎలాంటి అనుమానాలు, అపోహలు వద్దని సీఎం జగన్ పలు విధాలుగా చెబుతున్నా.. టీడీపీ మాత్రం విమర్శలు చేయడం ఆపడం లేదు. నిజంగా వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ నిలిపివేస్తే.. ఎవరికి నష్టం..? ఎవరికి లాభం..?
తన తండ్రి ఆశయ సాధనే తన లక్ష్యమని వైఎస్ జగన్ ఎప్పుడో ప్రకటించారు. ఆయనలాగా తన ఫొటో కూడా అందరి ఇళ్లలో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. అందు కోసం తన తండ్రి కన్నా కొంచెం ఎక్కువే ప్రజలకు మంచి చేయాలన్న తన ఉద్దేశాన్ని చాటి చెప్పారు. ఇలా చెబుతున్న సీఎం జగన్.. రైతుల కోసం తన తండ్రి ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకాన్ని ఆపగలడా..? లేదా రైతులను మీటర్ల పేరుతో ఇబ్బంది పెట్టగలడా..? అలా చేస్తే ఎవరికి నష్టం. తండ్రి పెట్టిన పథకాన్ని కొడుకు తీసేశాడనే అపవాదును సీఎం జగన్ కావాలనుకుంటారా..?
రైతుకు మంచి చేయాలనే ఉద్దేశంతో పగటి పూటే విద్యుత్ అందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఏడు గంటలు ఉన్న విద్యుత్‌ను.. ఎన్నికల హామీ మేరకు 9 గంటలకు పెంచారు. ఇందుకు అవసరమైన ఫీడర్లు, మౌలిక సదుపాయాలు కల్పించారు. ఒక వేళ జగన్ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసినా.. కనీసం చిన్నపాటి అంతరాయం కలిగించినా.. అది టీడీపీకి ఎనలేని మేలు చేకూరుస్తుంది. ఎన్నికల్లో చంద్రబాబు అడగకపోయినా రైతులందరూ ఆయనకే ఓట్లు వేసే పరిస్థితి వస్తుంది. ఈ విషయం చంద్రబాబుకు తెలియదని అనుకోవడానికి లేదు.
2014 ఎన్నికల్లో రైతు అన్ని రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చేయని తనకు ఏ గతి పట్టిందో చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో అర్థం అయింది. జగన్ సర్కార్ నిజంగా ఉచిత విద్యుత్ పథకాన్ని నిలిపివేస్తే.. తన నెత్తిన పాలుపోసినట్లేనని చంద్రబాబుకు తెలియంది కాదు. ఉచిత విద్యుత్ పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని సీఎం జగన్ చెబుతున్నా.. చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారంటే.. తాత్కాలికంగా రైతులను అయోమయానికి గురి చేయడానికేనని అర్థం అవుతోంది. దీని వలన బాబుకు వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ. బాబు ఇప్పుడు మాట్లాడే మాటలు భవిష్యత్‌లో వైసీపీ నేతలకు అశ్త్రాలుగా మారతాయనడంలో సందేహం లేదు.