iDreamPost
android-app
ios-app

హుజురాబాదులో నాలుగు ‘ఈ’ల కలవరం

  • Published Oct 09, 2021 | 7:29 AM Updated Updated Oct 09, 2021 | 7:29 AM
హుజురాబాదులో నాలుగు ‘ఈ’ల కలవరం

ఉప ఎన్నిక జరుగుతున్న హుజురాబాద్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాకపోవడం ఊరటనిచ్చినప్పటికీ.. మరో అంశం ఉత్కంఠకు గురి చేస్తోంది. ముఖ్యంగా బీజేపీని కలవరానికి గురిచేస్తోంది. నామినేషన్ల స్వీకరణ చివరి రోజు దాఖలైన ఇక్కడ పోటీకి నలుగురు రాజేందర్లు నామినేషన్లు వేశారు. వారందరూ రంగంలో కొనసాగితే ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇదే బీజేపీని ఆందోళనకు గురి చేస్తోంది.

ఉప ఎన్నిక నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి మొత్తం 61 మంది అభ్యర్థులు 92 సెట్ల పత్రాలు దాఖలు చేశారు. వీరిలో టీఆరెస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుండగా.. మిగిలినవారు గుర్తింపు లేని పార్టీలకు చెందినవారు, స్వతంత్రులే. మొత్తం అభ్యర్థుల్లో నలుగురి పేర్లు రాజేందర్ కావడం విశేషం. పైగా వారందరి ఇంటి పేర్లు కూడా ఇంచుమించు ఒకేలా ఉండటం చర్చకు తావిస్తోంది. రాజకీయంగా ఆరోపణల పర్వానికి తెర తీసింది. నాలుగు రాజేందర్లలో బీజేపీ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్ ఒకరు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఇమ్మడి రాజేందర్, న్యూ ఇండియా పార్టీ నుంచి ఈసంపల్లి రాజేందర్, ఆలిండియా ఓబీసీ పార్టీ నుంచి ఇప్పలపల్లి రాజేందర్ నామినేషన్లు వేశారు.

Also Read : కోమటిరెడ్డి బ్రదర్స్ పై బీజేపీ చూపు?

ఇదంతా టీఆర్ఎస్ కుట్ర

ఇంటి పేర్లు, వ్యక్తి పేర్లు ఒకేలా ఉన్న నలుగురు నామినేషన్లు వేయడం బీజేపీ, టీఆరెస్ పార్టీల మధ్య రాజకీయ రగడ రేపుతోంది. ఈటల రాజేందర్ ఓట్లకు గండి కొట్టాలన్న ధ్యేయంతోనే టీఆరెస్ నేతలు ఈ కుట్రకు పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కావాలనే ఒకే పేరు, ఒకేలా ఇంటి పేర్లు ఉన్న వారిని వెతికి మరీ నామినేషన్లు వేయించారని ఆరోపిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంత డబ్బు వెదజల్లినా ఈటల రాజేందర్ విజయాన్ని అడ్డుకోలేరని అంటున్నారు. అయితే టీఆరెస్ నేతలు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ముమ్మాటికీ తామే గెలుస్తామని.. తమకు ఇటువంటి కుట్రలు చేయాల్సిన అవసరంలేదని వాదిస్తున్నారు.

అందరూ పోటీలో కొనసాగితే ఇబ్బందే..

హుజురాబాదులో బీజేపీ, టీఆరెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. వాటికి తోడు కాంగ్రెస్ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఓటు కీలకమే. అలాంటప్పుడు ఈవీఎంలో నాలుగు ఒకేలాంటి పేర్లు కనబడితే ఓటర్లు తికమకపడతారు. ఒకరికి బదులు మరొకరికి ఓటు వేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓట్లు కొన్ని మిగతా రాజేందర్లకు మళ్లిపోయే ప్రమాదం ఉంది. ఇంకా నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఘట్టాలు ఉన్నాయి. పరిశీలనలో వీరిలో ఎందరు ఉంటారో తెలియదు. అయినా నామినేషన్లు వేసిన వారితో ఉపసంహరింపజేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఈటలను గెలిపించేందుకే రేవంత్‌ ‘ప్రమాదకరం’ వ్యాఖ్యలు చేశారా..?