కరోనా మహమ్మారి మరో రాజకీయ నేతను బలిగొంది. మాజీ మంత్రి, ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన కాంగ్రెస్ నేత మాతంగి నర్సయ్య(76) కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయనని కుటుంబ సభ్యులు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
ఆసుపత్రిలో 20 రోజులుగా చికిత్స పొందుతున్న మాతంగి నర్సయ్యకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య జోజమ్మ కరోనా రక్కసి కోరల్లో చిక్కి 15 రోజుల క్రితమే చనిపోవడం గమనార్హం. రెండు వారాల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ కరోనాతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్ జిల్లాలోని మేడారం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాతంగి నర్సయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.అలాగే నాదెండ్ల భాస్కరరావు క్యాబినెట్‌లో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా కొంతకాలం పాటు ఆయన పనిచేశారు.1983లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన మాతంగి నర్సయ్య,1989 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరుపున రెండోసారి గెలుపొందారు.అనంతరం తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న నాయకత్వ మార్పుతో తిరిగి ఆ పార్టీలో చేరిన ఆయన 1999 అసెంబ్లీ ఎన్నికలలో మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2009 పార్లమెంట్ ఎన్నికలలో భాజపా తరఫున పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు.కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ప్రస్తుతం ఆయన వయోభారానికి తోడు అనారోగ్య సమస్యలతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.