కరోనా దేశంలో సామాన్యులతో పాటు పలువురు నాయకులను సెలెబ్రెటీలను కూడా వణికిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు కరోనా బారిన పడగా పలువురు నాయకులు కరోనా కారణంగా మరణించారు.ఇప్పటికే కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బిజేపి సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు మరణించగా తాజాగా తెలంగాణ మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నంది ఎల్లయ్య అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నంది ఎల్లయ్య నిమ్స్ ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో పరిస్థితి విషమించింది. దాంతో ఈరోజు ఉదయం 10.30 నిమిషాలకు ఆయన మరణించారు
నంది ఎల్లయ్య మరణవార్త తెలిసి ఆయన స్వస్థలం రాంనగర్‌లో ఆయన ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని కుటుంబసభ్యులకు తెలియజేసారు. కాంగ్రెస్ నేతలు తమ సంతాపాన్ని తెలిపారు.
పలుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన నంది ఎల్లయ్య స్వస్థలం రాంనగర్. నంది ఎల్లయ్య ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యడిగా పనిచేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.