ఏపీ రాజకీయాల్లో సామాజికవర్గాల వారీగా చూస్తే గుర్తింపు పొందిన నేతల్లో జీవీ హర్షకుమార్ ఒకరు. అమలాపురం రిజర్వుడు పార్లమెంట్ స్థానం నుంచి ఆయన రెండో సార్లు విజయం సాధించారు. వీ హనుమంతరావు అనుచరుడిగా వైఎస్సార్ కి వ్యతిరేక శిబిరంలో సుదీర్ఘకాలం సాగారు. ఇక వైఎస్సార్ మరణానంతరం మారిన రాజకీయాల్లో హర్షకుమార్ అడుగులు తడబడ్డాయనే చెప్పవచ్చు. నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో జతగట్టి ఏకంగా జై సమైక్యాంద్ర పార్టీ లో కీలకంగా వ్యవహరించి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత కూడా 2019 ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు ముందు సాగిలపడ్డారు. చివరకు ఆయన కాళ్లకు మొక్కే యత్నం చేసిన తీరు హర్షకుమార్ ఇమేజ్ ని తీవ్రంగా దెబ్బతీసిందనే చెప్పవచ్చు. అప్పటి వరకూ హర్షకుమార్ ని అభిమానించిన వర్గాల్లో కూడా చంద్రబాబు ముందు ఆయన చేసిన ప్రయత్నం తీవ్రంగా నిరాశపరిచింది. అనేకమందిని హర్షకుమార్ ని దూరం చేసింది.
హర్షకుమార్ కి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. విద్యార్థి దశలో ఆంధ్రాయూనివర్సిటీ నుంచి ఆయన ప్రస్థానం మొదలయ్యింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హయంలో రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేశారు. తొలుత పాయకరావు పేట అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగి పరాజయం పాలయ్యారు. ఆతర్వాత 2002లో రాజమండ్రి మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ బరిలోనూ ఓటమి తప్పలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానంతో ఆయనకున్న పరిచయాలు పనిచేశాయి. చివరకు 2004 ఎన్నికల్లో అమలాపురం ఎంపీ సీటు దక్కించుకోవడంతో కీలకనేతగా ఎదిగేందుకు ఉపయోగపడింది.
అంతకుముందు ఆయన ఎస్సీ మాల కులంలో అనేక ఉద్యమాలు నిర్వహించిన నేతగా పేరు గడించారు. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ అంశంలో చంద్రబాబు సర్కారుపై పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపట్టారు. గత ప్రభుత్వంలో కూడా పలుమార్లు చంద్రబాబు తీరు మీద దండెత్తారు. గరగపర్రు వంటి అంశాలలో పోరాడిన నేతగా హర్షకుమార్ కి పేరుంది. చివరకు చంద్రబాబు హయంలో ఆయన్ని జైలు పాలుజేశారు. పలుమార్లు గృహనిర్బంధం విధించారు. అయినప్పటికీ పోరాడిన హర్షకుమార్ హఠాత్తుగా ఎన్నికలకు ముందు అమలాపురం ఎంపీ సీటు కోసం చేసిన ప్రయత్నం విమర్శలకు అవకాశం ఇచ్చింది. చంద్రబాబు టికెట్ ఇవ్వకపోగా హర్షకుమార్ ని అవమానించినట్టుగా స్పష్టమయ్యింది. దాంతో తన తప్పిదాన్ని గ్రహించిన హర్షకుమార్ ఆ తర్వాత టీడీపీకి కూడా దూరంగానే ఉంటున్నారు
తాజాగా మరోసారి తన సొంత గూటికి చేరాలని హర్షకుమార్ నిర్ణయించుకోవడం ఆసక్తిగా మారుతోంది. ఏపీలో కాంగ్రెస్ పునాదులు కూలి కకావికలం అయ్యింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ మళ్లీ కోలుకుంటుందా అంటే ప్రస్తుతానికి సందేహమే. అయితే జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితుల రీత్యా హర్షకుమార్ మరోసారి కాంగ్రెస్ బాట పడుతున్నారు. ప్రధానంగా హథ్రాస్ విషయంలో రాహుల్, ప్రియాంక గాంధీ చొరవ ఆకట్టుకుందని హర్షకుమార్ ప్రకటించారు. దాంతో ఆయన కాంగ్రెస్ లో చేరితే రాజకీయంగా మరింత క్రియాశీలకంగా మారే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. వాస్తవానికి ఏపీ కాంగ్రెస్ లో అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించగల స్థాయిలో నాయకులు కనిపించకపోవడం, ఉన్న వారిలో అనేక మంది నిరాకరించడంతో చివరకు శైలజానాథ్ ని పీసీసీ అధ్యక్షుడిని చేశారు. కానీ ఏపీలో మాదిగ సామాజికవర్గంతో పోలిస్తే మాల కులమే పెద్దది. కాబట్టి హర్షకుమార్ రాకతో కాంగ్రెస్ లో ఎస్సీలకు మరింత గుర్తింపు దక్కుతుందని కొందరు ఆశిస్తున్నారు. కానీ హర్షకుమార్ దూకుడు, ఆయన కుమారుడి వ్యవహారం వంటివి నియంత్రణ లేకపోతే మాత్రం ఆయనకు మళ్లీ ఎదురుదెబ్బలు తప్పవని అంచనాలు వినిపిస్తున్నాయి.