iDreamPost
android-app
ios-app

జడ్జినే ప్రలోభపెట్టి.. కటకటాల పాలై

జడ్జినే ప్రలోభపెట్టి.. కటకటాల పాలై

ఫ్రాన్స్‌ మాజీ దేశాధ్యక్షుడు దోషి కేసులో అసలు కథ ఇది

ఫ్రాన్స్‌ మాజీ దేశాధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీ ఓ అవినీతి కేసులో దోషిగా తేలారు. ఏకంగా ఓ జడ్జినే ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారన్న కేసులో సర్కోజీపై మోపిన అభియోగాలను ప్యారిస్‌ కోర్టు నిర్ధారించింది. మూడేళ్ల జైలుశిక్ష విధించగా, అందులో రెండేళ్ల జైలుశిక్షను సస్పెన్షన్‌లో ఉంచింది. ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు ఆయనకు 10 రోజుల సమయం ఇచ్చింది. ఆధునిక తరంలో ఫ్రాన్స్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించి జైలుశిక్షకు గురైన రెండో వ్యక్తి సర్కోజీ నిలిచారు.

ఇవీ కేసు పుర్వాపరాలను

సర్కోజీ ఫ్రాన్స్‌ దేశానికి అధ్యక్షునిగా 2007 నుంచి 2012 వరకూ కొనసాగారు. ఆయన 2007 ఎన్నికల సమయంలో లిబియా నియంత గడాఫీ నుంచి తన ఎన్నికల ప్రచారానికి ఆర్థికసాయం పొందారనే అభియోగాలు వెలువడ్డాయి. అంతేకాకుండా 2007 అధ్యక్ష ఎన్నికల సమయంలో ‘లో రియల్‌’ ఫ్యాషన్‌ ఉత్పత్తుల సంస్థ వారసురాలు లిలియానే బెట్టెన్‌ కోర్ట్‌ నుంచి అక్రమ చెల్లింపులను స్వీకరించాడంటూ సర్కోజీపై ఆరోపణలు వచ్చాయి. 2012లో ఆయన గద్దె దిగిన తర్వాత ఈ విషయాలు వెలుగు చూశాయి. దీనిపై విచారణ ఆ దేశ దర్యాప్తు సంస్థ విచారణ చేపడుతున్న సమయంలోనే మాజీ దేశాధ్యక్షుడు సర్కోజీ, ఆయన న్యాయవాది థియరీ హెర్జోగ్‌ మధ్య జరిగిన టెలిఫోన్‌ సంభాషణలు వెలుగుచూశాయి. ఇవి అప్పట్లో పెను సంచలనం రేపాయి. 2007 నుంచి 2012 వరకు ఫ్రెంచ్‌ అధ్యక్షుడిగా ఉన్న ఆయన రాజకీయాల నుంచి దూరంగా ఉన్నప్పటికీ కన్సర్వేటివ్‌ లలో ఆయనకు ఇంకా పలుకుబడి ఉంది.

మూడేళ్ల జైలుశిక్ష

అయితే ఈ కేసులో విచారణ జరుపుతున్న జడ్జి గిల్బెర్ట్‌ అజిబెర్ట్‌ను ప్రలోభాలకు గురిచేశాడని, కీలక సమాచారం తనకందిస్తే మొనాకోలో భారీ ఆస్తిని సొంతం చేస్తానని ఆఫర్‌ ఇవ్వడంతో పాటుగా న్యాయమూర్తి గిల్బర్ట్‌ అజిబర్ట్‌కి పదోన్నతి కల్పించారన్న ఆరోపణల నేపథ్యంలో సర్కోజీపై ఈ కేసులతో పాటుగా మరో కేసు నమోదైంది. ఈ కేసులోనే సర్కోజీకి తాజాగా శిక్ష పడింది. సర్కోజీపై ఆరోపణలతో ఏకీభవించిన ఫ్రెంచ్‌ న్యాయస్థానం అతన్ని దోషిగా తేల్చింది. ఈ కేసులో సర్కోజీకి ఆ దేశ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. మూడేళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ.. ఇందులో రెండు ఏండ్లను సస్పెండ్‌ చేసింది. ఆ దేశ నిబంధనల ప్రకారం ఏడాది మాత్రమే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాగా ఈ తీర్పుపై అపీల్‌ చేసుకునేందుకు ఆయనకు కోర్టు పది రోజుల గడువు ఇచ్చింది.

నేనేమి తప్పు చేయలేదు..

అయితే తానేమీ తప్పు చేయలేదని సర్కోజీ అంటున్నారు. తన వ్యవహారాలపై కావాలనే, తనను కేసులో ఇరికించాలనే నిఘా పెట్టిన ఫైనాన్షియల్‌ ప్రాసిక్యూటర్ల కుట్రే ఇదని ఆయన అన్నారు. కాగా కోర్టు రూలింగ్‌ పై అప్పీలు చేసుకునేందుకు ఆయనకు 10 రోజుల వ్యవధి ఉంది. లోగడ దివంగత మాజీ నేత జాక్వెస్‌ షిరాక్‌ కూడా ఇలా అభియోగాలకు గురయ్యారు. కాగా నికోలస్‌ సర్కోజీ అవినీతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.