iDreamPost
android-app
ios-app

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ మృతి

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ మృతి

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత డీన్ జోన్స్ (59) తీవ్ర గుండెపోటు కారణంగా మృతి చెందారు. వారం క్రితం ఆయన ఐపీఎల్ 13వ సీజన్ ఆఫ్-ట్యూబ్ కామెంట్రీకి బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌స్పోర్ట్స్‌ తరఫున కామెంట్రీ చేసేందుకు భారత్‌కు వచ్చారు. ముంబైలోని ఓ సెవెన్ స్టార్ హోటల్‌లో బయో సెక్యూర్ బబుల్‌లో ఉన్నారు. ఆయన నిన్నటి మ్యాచ్ కూడా ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్‌లో ఉన్నారు. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న మెగా టోర్నీ ఐపీఎల్ వ్యాఖ్యానం కోసం వచ్చిన ఆయన ముంబైలో తుదిశ్వాస విడవడం విషాదకరం.

కాగా ఇవాళ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన జోన్స్ 11 గంటలకు ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ విషయమై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత హోటల్ కారిడార్‌లో సహచరులతో కలసి యుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే హోటల్ సిబ్బంది ఆయనని అంబులెన్స్‌లో హరికిషన్ దాస్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.ఆయనని హాస్పిటల్‌లో పరీక్షించిన డాక్టర్లు హార్ట్ ఎటాక్ కారణంగా అప్పటికే డీన్ జోన్స్ మరణించినట్లు ప్రకటించారు.

డీన్ జోన్స్ అద్భుతమైన క్రికెట్ విశ్లేషకులు. తనదైన కామెంటరీతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేవారు. పలు అంతర్జాతీయ మ్యాచ్‌లకే కాకుండా వివిధ దేశాలలో జరిగే వివిధ లీగ్‌లకు కూడా ఆయన కామెంట్రీ చెప్పేవాడు. ఎన్డీటీవీలో ప్రసారమయ్యే అతని ” ప్రొఫెసర్‌ డీనో'” కార్యక్రమం బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే.

విక్టోరియా బ్యాట్స్‌మన్ డీన్‌ జోన్స్‌ ప్రముఖ ఆసీస్ కెప్టెన్ అలెన్ బోర్డర్ జట్టులో ఓపెనర్‌గా కీలక పాత్ర వహించే వాడు.అంతర్జాతీయ క్రికెట్ లో 1984లో ప్రవేశించిన డీన్ జోన్స్ ఎనిమిదేళ్ల పాటు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించారు. తన సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో ఆసీస్‌ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలు ఆడారు. టెస్టులలో 46.55 సగటుతో 3,631 పరుగులు సాధించాడు. అందులో 11 సెంచరీలు చేసిన జోన్స్ అత్యధిక స్కోరు 216. ఇక 164 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆయన 44.61 సగటుతో 6,068 రన్స్‌ చేశాడు.ఇందులో ఏడు సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి.