iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు చిక్కిన చిరుత

ఎట్టకేలకు చిక్కిన చిరుత

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా జనసంచారం తగ్గడంతో అడవి జంతువులు రోడ్లపైకి వచ్చిన వచ్చాయి.వాటిలో ఎక్కువ శాతం జంతువులను అటవీ అధికారులు బంధించి తిరిగి అడవుల్లో వదిలిపెట్టారు. కానీ ఐదు నెలల క్రితం హైదరాబాద్ రోడ్లపై ఒక చిరుత హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ చిరుతను పట్టుకోవడానికి అటవీ అధికారులు చేయని ప్రయత్నాలు లేవు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా బోనులు ఏర్పాటు చేసినా చిరుత చిక్కలేదు. ఎట్టకేలకు ఆ చిరుత అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కడంతో స్థానికులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఐదు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని అండర్‌పాస్‌ బ్రిడ్జి వద్ద గాయాలతో రోడ్డుపై పడి ఉన్న చిరుతను స్థానికులు గమనించారు. కాలికి గాయమై కదల్లేని స్థితిలో ఉన్న చిరుతను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ చిరుతను చూసిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈలోగా చిరుత అక్కడినుండి పరారయ్యింది. అనంతరం రాజేంద్రనగర్ ప్రాంతంలో అధికారులను ముప్పుతిప్పలు పెట్టడంతో పాటు లేగదూడలు, ఆవుల మంద, మేకల మందలపై దాడి చేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

అధికారులు అప్పటినుండి చిరుతను బంధించడానికి అనేక చోట్ల బోనులు ఏర్పాటు చేసినా సరే చిరుత చిక్కలేదు. ప్రతీ 10 రోజులకు ఒకసారి చిరుత స్థానికులకు కనిపిస్తూ ఉండడంతో భయాందోళనకు గురయ్యేవారు. చివరకు రాజేంద్ర నగర్‌లోని వాలంతరి వ్యవసాయ క్షేత్రంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.