Idream media
Idream media
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో అలహాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మహ్మద్ షాహిద్ జమాతేకు చెందిన విదేశీయులను రెండు మసీదులలో దాచిపెట్టిన సంగతి వెలుగులోకి వచ్చింది.తబ్లీగీ జమాతేకు చెందిన ఇండొనేషియా, థాయ్‌లాండ్ వ్యక్తులను కొందరు మసీదులలో దాచిపెట్టారనే పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేశారు.దీంతో అక్రమ నిర్వాసితుల గుట్టురట్టయింది.
ఈ దాడులలో ఏడుగురు ఇండొనేషియా,9 మంది థాయ్‌లాండ్ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా వీరికి మసీదులలో ఆశ్రయం కల్పించిన ప్రొఫెసర్ షాహిద్ సహా మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల అనంతరం వీరందరూ తమ దేశాలకు తిరిగి వెళ్లకుండా అక్రమంగా నివసించడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రాంతంలోని మరికొన్ని మసీదులలో కూడా జమాతేకు చెందిన సభ్యులు దాక్కొని ఉండే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
గత మార్చి 15-17 మధ్యలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జమాతే మర్కజ్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన వేలాది ముస్లింలు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సదస్సు ముగిసిన తర్వాత కొందరు తమ దేశాలకు తిరిగి వెళ్లకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు అక్రమంగా తరలివెళ్లారు. వీసా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నివాసముంటున్న కొందరిని ప్రభుత్వం గుర్తించి అరెస్ట్ చేసింది.కానీ ఇప్పటికీ చాలామంది విదేశీయుల జాడ తెలియటం లేదు.
కరోనా వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉంటే విదేశీ జమాతే సభ్యులను మసీదులలో దాచిపెట్టడంపై యూపీ సర్కారు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది.ఈ అక్రమ దాచివేత వెనుక విద్రోహ కుట్ర దాగి ఉన్నట్లు భావిస్తున్న యోగి సర్కారు దర్యాప్తును ముమ్మరం చేసింది.