iDreamPost
android-app
ios-app

ఎవరి కోసం నారా లోకేష్ పరామర్శ యాత్రలు ?

  • Published Sep 09, 2021 | 6:50 AM Updated Updated Sep 09, 2021 | 6:50 AM
ఎవరి కోసం నారా లోకేష్ పరామర్శ యాత్రలు ?

టీడీపీలో తర్వాతి తరం నాయకుడిగా ప్రాజెక్ట్ చేయబడుతున్న నారా లోకేష్ అందుకు తగ్గట్టుగా ఇటీవలి కాలంలో పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు .

అందులో భాగంగానే ఇటీవల గుంటూరులో హత్య కావించబడిన రమ్య కుటుంబాన్ని పరామర్శించే యాత్ర కానీ , ఈ రోజు నరసరావుపేటలో ఏడు నెలల క్రితం హత్య కావించబడిన అనూష కుటుంబ సభ్యుల పరామర్శ యాత్ర కానీ చేస్తున్నారు అనటంలో సందేహం లేదు .

లోకేష్ మాత్రమే కాదు , ఏ నాయకుడైనా ప్రజా సమస్యల పరిష్కారానికి , బాధిత కుటుంబాలకు న్యాయం జరగడానికి ప్రజా క్షేత్రంలోకి వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయడంలో తప్పులేదు . కానీ వారు ఎంచుకున్న సమస్యలు , వ్యవహరించే తీరు ప్రజాస్వామ్యయుతంగా లేకుండా , ఉద్దేశ్య పూర్వకంగా సమస్యలు లేవనెత్తి , ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడం , ప్రజల్లో గందరగోళ స్థితి నెలకొల్పడం , అసత్య కథనాలు ప్రచారం చేయడం లాంటి చర్యలతో లబ్ది పొందేందుకు ఈ యాత్రలను ఉపయోగించుకోవాలనుకోవడం అనైతికం .

ఈ ఏడాది ఆగస్టు 15 న గుంటూరులో రమ్య అనే విద్యార్థి పాశవికంగా హత్య గావించబడిన తర్వాత నిందితుణ్ణి వెంటనే వెతికి పట్టుకున్న పోలీసులు అరెస్ట్ చూపి కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టటం , అతన్ని రిమాండ్ కి పంపడం , ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం లాంటి చర్యలు వేగంగా పూర్తి చేశారు .

Also Read : బాపు, వేటూరిలు జీవించి ఉంటే రాధా కృష్ణ పోలికల రాతలకు ఏమయ్యేవారో..?

ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం చేయడమే కాక నైతిక స్థైర్యం కల్పించే ప్రయత్నం చేసిన పెద్దలు బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు .

అదే రోజు రమ్య కుటుంబ సభ్యుల పరామర్శ కోసం లోకేష్ యాత్రకు పోలీసు అనుమతి తీసుకొన్న టీడీపీ నేతలు , రమ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యి హాస్పిటల్ నుండి ఇంటికి తరలిస్తుండగా ఆ అంబులెన్స్ కి అడ్డుపడి మా లోకేష్ వచ్చేవరకూ మృతదేహాన్ని తరలించటానికి వీలు లేదని రోడ్డు మీద ధర్నా పేరిట పోలీసులకు , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అల్లరి సృష్టించే ప్రయత్నం పట్ల పోలీసులే కాదు ప్రజలు సైతం అసహనం ప్రదర్శించారు .

ఈ నేపథ్యంలో ఏడు నెలల క్రితం హత్య గావించబడిన అనూష అనే విద్యార్థి పరామర్శ పేరిట లోకేష్ ఇప్పుడు నరసరావుపేట యాత్రకు , పట్టణంలో ధర్నాకు పెర్మిషన్ కోరగా గత అనుభవాల దృష్ట్యా లోకేష్ మళ్లీ అల్లర్లు చెలరేగే విధంగా ప్రవర్తించవచ్చని భావించిన పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు మహిళల పై జరిగే నేరాలను రాజకీయం చేయొద్దని నేరస్తులను పట్టుకొని కోర్టు ద్వారా శిక్షింప జేసే విషయంలో పోలీసు వ్యవస్థ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని , రమ్య హత్య తరువాత జరిగిన వివాదాలను గమనిస్తే లోకేష్ యాత్ర అల్లర్లకు వేదిక అయ్యే అవకాశం ఉన్నందున యాత్రకు అనుమతి నిరాకరిస్తున్నామని గుంటూరు రేంజ్ డిఐజి తేల్చిచెప్పారు .

Also Read : జ‌గ‌న్ విష‌యంలో ముగ్గురూ.. ఒక్క‌టేనా..!?

ఇదే అంశం పై స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఈ యాడాది ఫిబ్రవరిలో అనూష హత్య గావించబడిన వెంటనే 24 గంటల లోపు నిందితుడు విష్ణువర్ధన్ రెడ్డిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారని , వారం రోజుల్లో విచారణ జరిపి తుది ఛార్జ్ షీట్ దాఖలు చేయగా ఈ నెల 21 నుండి కోర్టు విచారణ ప్రారంభం కానుంది అని తెలియజేసారు . అంతేకాకుండా ప్రభుత్వం తరపున తాను , సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు వెళ్లి బాధిత మహిళ కుటుంబానికి ధైర్యం చెప్పి పదిలక్షల ఎక్స్గ్రేషియా మొత్తం ఇవ్వటంతో పాటు , కుటుంబంలో ఒకరికి ఉద్యోగం , అనూష కుటుంబ సభ్యుల కోరిక మేరకు నరసరావుపేటలో ఇళ్ల స్థలం హామీగా ఇచ్చామని అందుకు తగ్గట్టుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపామన్నారు .

అయితే ఈ విషయాలన్నీ తెలిసి కూడా కేవలం రాజకీయ లబ్ది కోసం నారా లోకేష్ ఘటన జరిగిన ఏడు నెలల తర్వాత బాధిత కుటుంబం నివాసమైన సత్తెనపల్లి వెళ్లి పరామర్శించకుండా నరసరావుపేటలో ధర్నా చేస్తానని పట్టుపట్టటం ప్రశాంతంగా ఉన్న పట్టణంలో అల్లర్లు రేకెత్తించటానికి , రాజకీయంగా లబ్ది పొందాలన్న ఉద్దేశ్యం తప్ప మరొకటి కాదన్నారు .

ఆ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందించిన లోకేష్ అధికార , కుల మదంతో కొవ్వెక్కిన నీకు కళ్ళు తెరిపించటానికే నరసరావుపేట వస్తున్నానంటూ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది . ఐటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న లోకేష్ కొన్ని సార్లు సభ్య సమాజం హర్షించని రీతిలో అనాగరిక పదాలతో ప్రత్యర్థి పార్టీల వారిని దూషించడం చేస్తుండగా , ఇలాంటి భాష వాడటం అనైతికమని తటస్థ మేధావులు పలువురు సూచిస్తున్నా లోకేష్ పెడచెవిన పెట్టడం విశేషం. 

Also Read : అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు, ఇప్పుడు కర్మ సిద్ధాంతం.. లోకేష్ తీరు