ఎవరైనా హీరోకో దర్శకుడికో ఫ్లాప్ వచ్చినంత మాత్రాన మళ్లీ అదే రిపీట్ అవుతుందన్న గ్యారెంటీ ఏమి లేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు బౌన్స్ బ్యాక్ అయినవాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఒక సాలిడ్ హిట్ కోసం ఇద్దరు కాంబో కాబోతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ ని దర్శకుడు విఐ ఆనంద్ ప్లాన్ చేయబోతున్నట్టుగా తెలిసింది. ఈయన గత చిత్రం రవితేజ ‘డిస్కోరాజా’ విపరీతమైన అంచనాల మధ్య డిజాస్టర్ గా నిలిచింది. అంతకు ముందు అల్లు శిరీష్ తో చేసిన ‘ఒక్క క్షణం’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
ప్రయోగాత్మక కథలతో మెప్పిస్తాడనే పేరున్న ఆనంద్ కు టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత ఆ స్థాయి విజయం దక్కలేదు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ పాయింట్ తో కమర్షియల్ సినిమా తీయాలనే ప్రతిపాదనతో ఇటీవలే ఓ కథ వినిపించారు. పలుమార్లు దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగాయట. కళ్యాణ్ రామ్ సైతం సక్సెస్ కోసం మొహం వాచిపోయి ఉన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేసి ఎంతో ఆశలు పెట్టుకున్న ‘ఎంత మంచివాడవురా’ ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే కొత్తగా ఏదైనా ట్రయ్ చేయాలనే ఆలోచనలో విఐ ఆనంద్ లైన్ గురించి సీరియస్ గానే ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ బిజీగా ఉన్నాడు.
తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో రూపొందబోయే సినిమాకు హారిక హాసిని సంస్థతో కలిసి నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యేది ఇంకా ఖరారు కాలేదు కానీ ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. ఇన్నేళ్ల కెరీర్లో మూడు నాలుగు తప్ప చెప్పుకోదగ్గ పెద్ద హిట్ లేని కళ్యాణ్ రామ్ ఈసారి మెకోవర్ కు కూడా రెడి అంటున్నారు. దానికి తగ్గట్టే ఫిజిక్ తో పాటు హెయిర్ స్టైల్ ని కూడా కొత్తగా సెట్ చేసుకుంటున్నారు. ఇది విఐ ఆనంద్ కోసమా లేక ఇంకేదైనా వేరే కమిట్మెంట్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. లాక్ డౌన్ వేళ మొత్తం స్థంభించిపోయిన నేపథ్యంలో కొత్త అనౌన్స్ మెంట్లు వచ్చేందుకు టైం పడుతుంది.