iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కరోనా కష్టాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. వాటి నుంచి కోలుకోవడమే కష్టంగా మారిన సమయంలో ఇటీవలి వాయుగుండం మరో దెబ్బ కొట్టింది. గోరుచుట్టు మీద రోకలిపోటులా మారింది. తీవ్ర నష్టాన్ని మోసుకొచ్చింది. ముఖ్యంగా రాయలసీమను కోలుకోలేని రీతిలో దెబ్బకొట్టింది. కడప, నెల్లూరు జిల్లాల్లో అపారనష్టం సంభవించింది. వివిధ శాఖలకు సంబంధించిన ప్రాథమిక నష్టం అంచనాలను ప్రభుత్వం రూపొందించింది.
రాష్ట్రంలో వరద నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనాలు విడుదల చేశారు . లక్షా 42 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు . మొత్తం నష్టం అంచనా రూ .6,054 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో రహదారులు డ్యామేజ్ అవటం వల్ల జరిగిన నష్టం రూ .1,756 కోట్లుగా ప్రకటించారు . డ్యాములు , సాగునీటి శాఖకు జరిగిన నష్టం మరో రూ.556 కోట్లు గా ఉంది. వ్యవసాయ రంగానికి జరిగిన నష్టం రూ .1,353 కోట్లుగా ఉంటుందని లెక్కించారు.
వాటితో పాటుగా విద్యుత్ రంగం, పాడి పరిశ్రమ సహా వివిధ రంగాల నష్టాలు అంచనా వేస్తే మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు. రాయలసీమలో ఇంతటి విపత్తు ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే హుద్ హుద్ తర్వాత ఇదే పెద్ద నష్టం అని చెబుతున్నారు. ఇంత పెద్ద స్థాయిలో సీమను, ఏపీని దెబ్బతీసిన వరదల సహాయంపై కేంద్రం స్పందించాలని పలువురు కోరుతున్నారు.
ఉత్తరాది రాష్ట్రాలు, ముఖ్యంగా గుజరాత్ లో సంభవించే విపత్తుల పట్ల తక్షణమే స్పందించే ప్రధాని ఈసారి కేవలం సీఎంకి ఫోన్ చేయడం మినహా చిన్నపాటి సహాయక చర్యలకు తోడ్పాటు అందించిన దాఖలాలు లేవు. ఏపీలో బీజేపీ నేతలు కొందరు మాత్రం వరద రాజకీయాలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తక్షణం కేంద్రం కూడా స్పందించి బాధితులను ఆదుకునేలా సహాయం ప్రకటించాలని అంతా ఆశిస్తున్నారు. అత్యంత కష్టాల్లో ఉన్న ఏపీకి ఇది పెద్ద సమస్య అవుతుంది కాబట్టి, ఏపీకి కేంద్రం చేదోడు ఉండాలని కోరుతున్నారు.
Also Read : AP Floods, CM Jagan Letter – వరద ముంచెత్తింది.. ఆదుకోండి.. ప్రధానికి సీఎం లేఖ