iDreamPost
android-app
ios-app

Flipkart, CM Jagan సీఎం జగన్మోహన్ రెడ్డితో ఫ్లిప్ కార్ట్ సీఈఓ కీలక భేటీ.. భారీ పెట్టుబడులకు ప్రణాళికలు

Flipkart, CM Jagan సీఎం జగన్మోహన్ రెడ్డితో ఫ్లిప్ కార్ట్ సీఈఓ కీలక భేటీ.. భారీ పెట్టుబడులకు ప్రణాళికలు

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే తనదైన శైలిలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వైయస్‌ జగన్‌ ను ప్రముఖ ఇ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తి కలిశారు. ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తి సహా కంపెనీ కీలక అధికారుల బృందం సీఎం వైయస్‌ జగన్‌తో భేటీ అయింది.ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, రైతులకు మంచి ధరలు అందేలా చూడటం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఈ భేటీలో చర్చలు జరిగాయి.

రాష్ట్రంలో వ్యవసాయరంగంలో విప్లవాత్మక చర్యగా ఆర్బీకే(రైతు భరోసా కేంద్రం)లను ప్రారంభించామని, రైతులకు విత్తనం అందించడం దగ్గరనుంచి వారి పంట కొనుగోలు వరకు ఆర్బీకేలు నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తాయని జగన్ ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కు వివరించారు. అంతే కాకుండా రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేలా ఫ్లిప్‌ కార్ట్‌ దోహదపడాలని జగన్ వారికీ విజ్ఞప్తిచేశారు. వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగదారులకు అందించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, మంచి టెక్నాలజీ అందుబాటులోకి తీసుకువచ్చి వారికి సహాయం చేయాలని కోరారు. ఎప్పటికప్పుడు ధరల పర్యవేక్షణకు సీఎం యాప్‌ ఉందని, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు కూడా అందించాలని వారిని జగన్ కోరారు.

ఈ క్రమంలో తమ వ్యాపారంలో రైతుల నుంచి ఉత్పత్తులు కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కృష్ణమూర్తి ముఖ్యమంత్రికి తెలిపారు. ఇది వారికి,మాకు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. మంచి టెక్నాలజీని అందించేలా కూడా తమ వంతు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం ఐటీ, ఇ–కామర్స్‌ పెట్టుబడులకు మంచి వేదిక అని, అక్కడ మరిన్ని పెట్టుబడులకు మందుకు రావాలని సీఎం ఫ్లిప్‌కార్ట్‌కు పిలుపునివ్వడమే కాక స్కిల్ డెవలప్మెంట్ కోసం విశాఖలో హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, దీంట్లో భాగస్వాములు కావాలని కోరారు. జగన్ చేసిన అన్ని ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ సానుకూలత వ్యక్తంచేశారు.

విశాఖలో ఇప్పటికే తమ సంస్థ వ్యాపారం చురుగ్గా సాగుతుందని, మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో సైతం భాగస్వాములం అవుతామన్నారు. వచ్చే ఏడాది నుంచే ఈ కార్యక్రమాలు మొదలవుతాయని వెల్లడించారు. ఇక మత్స్య ఉత్పత్తులు రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, ఈ వ్యాపారాన్ని మరింత పెంచేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సహాయపడాలని సీఎం విజ్ఞప్తి చేయగా ఇప్పటికే తమ భాగస్వామ్య సంస్థ వాల్‌మార్ట్‌ ద్వారా రాష్ట్రంలో మత్య్స ఉత్పత్తుల కొనుగోలు, ఎగుమతి జరుగుతోందని, దీన్ని మరింతగా పెంచుతామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కృష్ణమూర్తి తెలిపారు.