Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు మరో కొత్త సంక్షేమ పధకానికి నేడు శ్రీకారం చుట్టనుంది. మత్యకారులకు పలు పధకాలు అమలుకు రంగం సిద్దయమైంది. ;ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం. ఈ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించేది. దీనిని ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది. 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పించడానికి బడ్జెట్‌లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
మత్స్యకారులకు ఇవి చేస్తున్నారు..
– మర పడవల నిర్వాహకులకు గత ప్రభుత్వం లీటర్ డీజిల్‌కు ఇచ్చే రూ.6.03 రాయితీ ఇప్పుడు రూ.9కి పెంపు. మరపడవలకే కాకుండా ఇంజను కలిగిన తెప్పలకూ డీజిల్ రాయితీ వర్తింపు. ఒక్కో మర పడవకు నెలకు రూ.27 వేలు, ఇంజను కలిగిన తెప్పలకు రూ.2,700 రాయితీ ఇస్తారు. ఏడాదిలో పది నెలలకు స్మార్డ్ కార్డుల ద్వారా రాయితీ అందుతుంది.
– సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం. (ఇప్పటి దాకా రూ.5 లక్షలు మాత్రమే)
– తొమ్మిది కోస్తా తీర జిల్లాల్లో దశల వారీగా ఫిష్ లాండింగ్ సదుపాయాల కల్పన. మూడు కొత్త ఫిషింగ్ హార్బర్లు (నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా ఓడరేవులో) ఏర్పాటు. మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్‌ల పటిష్టానికి చర్యలు.
– 2012లో సముద్రంలో చమురు, సహజ వాయువుల నిక్షేపాల అన్వేషణకు జరిపిన తవ్వకాల్లో ముమ్మిడివరం ప్రాంతంలో జీవన భృతి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రూ.78.24 కోట్ల పరిహారం (జీఎస్‌పీసీ బకాయిలు) అందించనుంది. దీని ద్వారా 16,559 మత్స్యకార కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. ఓఎన్‌జీసీ చెల్లించ వలసిన ఈ పరిహారాన్ని ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తోంది.