పాకిస్తాన్ చెర నుంచి విముక్తి పొందిన రాష్ట్రానికి చెందిన 20 మంది మత్స్యకారులు సీఎం క్యాంపు ఆఫీస్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దాయాది దేశంలో వారు పడిన కష్టాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న సీఎం.. పాక్ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని వారిని ఆరా తీశారు.
‘పోర్టు లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లాల్సి వస్తోంది. మాకు ఫిషింగ్ హార్బర్ నిర్మించి ఇస్తే ఇక్కడే కుటుంబాలతో కలిసి ఉంటాం. వేటకు వెళ్లిన తర్వాత పట్టే చేపలను బట్టి మాకు కూలీ ఇస్తారు. మా ప్రాంతంలో సముద్ర తీరం ఉంది. కానీ, 10–15వేల మంది గుజరాత్‌కు వెళ్లాల్సి వస్తోంది. జెట్టీలు, ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల మేమంతా గుజరాత్‌కు వలస వెళ్తున్నాం. పనిని బట్టే మాకు జీతాలు ఇస్తారు’ అని మత్స్యకారులు సీఎం జగన్ కు తమ గోడు చెప్పుకున్నారు.
మత్స్యకారులకోసం జట్టీలు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. భావనపాడు పోర్టు నిర్మాణంకోసం ప్రయత్నాలు చేస్తున్నామని, మత్స్యకారులకోసం ప్రత్యేకంగా ఒక జెట్టీని కేటాయిస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు కోరిన విధంగా జెట్టీని కట్టిస్తామని హామినిచ్చారు. అలాగే, పాకిస్తాన్ జైల్లో ఉన్న మిగిలిన ఇద్దరు, బంగ్లాదేశ్ జైల్లో ఉన్న 8 మంది మత్స్యకారులను విడిపించేందుకు ప్రయత్నాలు చేయాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అనంతరం సీఎం జగన్ మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కు ను అందించారు.
విజయనగరం జిల్లాకు చెందిన 20 మంది మత్స్యకారులు 2018 డిసెంబర్‌లో అరేబియా సముద్రంలోకి వేటకు వెళ్లారు. పాక్ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ వారిని పాక్ అధికారులు నిర్బంధించారు. వారిని విడుదల చేయించేందుకు అప్పటి చంద్రబాబు సర్కార్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ప్రజా సంకల్ప పాదయాత్రలో మత్స్యకార కుటుంబాలు తమ వారిని విడిపించాలని వైఎస్ జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారి విడుదలకు కృషి చేస్తామని వారికి సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ఈ మేరకు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఈ విషయం విదేశాంగ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆయన విదేశాంగ కార్యాలయంలో పలుమార్లు జరిపిన సంప్రదింపులు ఫలించాయి. నిన్న వాఘా బోర్డర్ వద్దకు వెళ్లిన ఏపీ మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంటకరమణ విడుదలైన జాలర్లను రాష్ట్రానికి తీసుకొచ్చారు.