iDreamPost
android-app
ios-app

తొలి సభకు సెలవు..!

తొలి సభకు సెలవు..!

తెలంగాణ రాష్ట్ర తొలి పాలకమండలి గడువు నేటితో ముగియనుంది. 11న కొత్త పాలక మండలి కొలువుదీరనుంది. 2014లో తెలంగాణ ఆవిర్భవించింది. 2016 ఫిబ్రవరిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 2న పోలింగ్‌ జరగగా.. 5న ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ 99 స్థానాలను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. ఎంఐఎం 44 స్థానాలను, బీజేపీ నాలుగు, కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో గెలుపొందగా.. తెలుగుదేశం ఒకే ఒక డివిజన్‌ (కేపీహెచ్‌బీ)లో గెలుపొందింది. అదే నెల 11న పాలకమండలి కొలువుదీరింది. చర్లపల్లి నుంచి గెలిచిన బొంతు రామ్మోహన్‌ మేయర్‌గా, బోరబండ కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

పూర్తిస్థాయి మెజార్టీ ఉండడం.. ఎంఐఎం కూడా సహకరించడంతో అభివృద్ధి, సంస్కరణలకు సంబంధించి చేసిన తీర్మానాలు కౌన్సిల్‌లో తిరుగులేకుండా ఆమోదం పొందాయి. ఎన్నో స‌మ‌స్య‌లు పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ పాల‌క మండ‌లి ముందు వ‌ర‌కూ కార్పొరేట‌ర్ కు రూ. 50 ల‌క్ష‌ల నిధుల కేటాయింపు ఉండేది. ప్ర‌స్తుత పాల‌క మండ‌లికి ఆ నిధుల కేటాయింపు జ‌ర‌గ‌లేదు. అధికారిక కేటాయింపుల ప్ర‌కార‌మే ప‌నులు కొన‌సాగేవి. అందువ‌ల్లే పూర్తి స్థాయిలో ప‌నులు చేయ‌లేక‌పోయామ‌ని ప‌లువురు కార్పొరేట‌ర్లు చెబుతుంటారు. ప‌ని తీరు స‌రిగా లేని కొంత మంది కార్పొరేట‌ర్ల‌కు తాజా ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ టికెట్ల‌ను కేటాయించ లేదు. టికెట్ పొందిన వారిలో కూడా చాలా మందిని ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. వారి ప‌నితీరు, అవినీతి ఆరోప‌ణ‌లు త‌దిత‌ర కార‌ణాల‌తో మెజార్టీ సిట్టింగ్ కార్పొరేట‌ర్లు ఓట‌మి పాల‌య్యారు.

ఫ‌లించ‌నున్న ఎదురుచూపులు..

తాజా ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ 56 స్థానాల్లోను, బీజేపీ నుంచి 48 (ఒక‌రు మృతి చెందారు), ఎంఐఎం 44, కాంగ్రెస్‌ 2 స్థానాలను సాధించాయి. బీజేపీ నుంచి గెలిచిన వారిలో దాదాపు అందరూ కొత్తవారే. అలాగే ఇతర పార్టీల్లో కూడా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్లు ఎన్నికల్లో గెలిచినా ఇప్పటి వరకూ కార్పొరేటర్‌ హోదా దక్కలేదు. ఇందుకు కారణం ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకూ ఉంది. పాలకమండలిని రద్దు చేయకుండానే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. గత ఎన్నికల మాదిరిగానే అత్యధిక మెజార్టీతో టీఆర్‌ఎస్‌ గెలిస్తే పెద్దగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉండేవి కావు. అత్యధిక స్థానాలను గెలిచినా బీజేపీకి కూడా ఇంచుమించు టీఆర్‌ఎస్‌ కు సమానంగా స్థానాలు గెలుచుకుంది. దీంతో వెంటనే కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. వారి క‌ల రేప‌టితో నెర‌వేర‌నుంది. ఈ నెల 11న ప్ర‌మాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్ల‌న్నీ పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుండగా, మధ్యాహ్న 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరుగనుంది. గురువారం కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు తెలంగాణ భవన్‌ నుంచి నేరుగా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌కు రానున్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల పేర్లు సీల్డ్‌ కవర్లలో పంపనున్నారు. సమావేశ మందిరంలోనే వాటిని తెరిచి, 11 గంటలలోపు ప్రిసైడింగ్‌ అధికారికి దరఖాస్తు సమర్పించనున్నట్టు తెలిసింది.