Idream media
Idream media
ఆంగ్లేయులు తాము ఎక్కడికి వెళ్లినా తమవెంట క్రికెట్ క్రీడను కూడా తీసుకెళ్లారు. భారత ఉపఖండంలో, వెస్టిండీస్ దీవుల్లో, దక్షిణాఫ్రికాలో క్రికెట్ ఇలాగే పాతుకుపోయింది. దేశవాళీ క్రికెట్ చాలా సంవత్సరాలుగా ఆడుతున్నా భారత జట్టు తన మొదటి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జూన్ 25,1932లో ఇంగ్లాండు పర్యటనలో ఆ జట్టుతో ఆడింది. భారత జట్టు తరఫున మొదటి సెంచరీ ఆ తరువాత సంవత్సరమే, డిసెంబర్ 15,1933న తన మొదటి టెస్టులో లాలా అమరనాధ్ సాధించాడు.
ఇరవై రెండేళ్ల తరువాత డబుల్ సెంచరీ
అయితే భారత్ తరఫున తొలి డబుల్ సెంచరీ నమోదు కావడానికి ఇరవై రెండు సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టుతో హైదరాబాద్ లోని ఫతే మైదాన్ లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ రెండవ రోజు నవంబర్ 20,1955న పాలీ ఉమ్రిగర్ 223 పరుగులు సాధించి, భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.
అయితే ఈ రికార్డు ఉమ్రిగర్ పేరిట ఎక్కువ రోజులు ఉండలేదు. అదే సిరీస్ లో భాగంగా జరిగిన రెండవ మ్యాచ్ లో డిసెంబర్ 3న వినూ మన్కడ్ 223 పరుగులతో ఉమ్రిగర్ రికార్డుని సమంచేసి, అయిదవ మ్యాచ్ లో జనవరి7, 1956న 231 పరుగులతో అధిగమించాడు. ఉమ్రిగర్ డబుల్ సెంచరీ సాధించిన మ్యాచ్ డ్రాగా ముగిస్తే, మన్కడ్ డబుల్ సెంచరీ సాధించిన రెండు మ్యాచుల్లో భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసింది.
మన్కడ్ రికార్డు ఇరవై ఏడు సంవత్సరాలు చెక్కుచెదరకుండా నిలిచింది. డిసెంబర్ 28,1983న పాకిస్తాన్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో సునీల్ గవాస్కర్ 236 పరుగులతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దీనిని మార్చి 13, 2001న కలకత్తాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన డబుల్ సెంచరీతో వివిఎస్ లక్ష్మణ్ అధిగమించాడు. ఫాలో ఆన్ ఆడుతూ వెనుకబడిన భారత జట్టును 281 పరుగులతో గెలిపించాడు లక్ష్మణ్.
సెహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచరీలు
భారతజట్టు తరఫున సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ ఆడి అనేక రికార్డులు సృష్టించిన ఇద్దరు లిటిల్ మాస్టర్స్ సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ సాధించలేని ట్రిపుల్ సెంచరీని డాషింగ్ బ్యాట్సుమన్ వీరేందర్ సెహ్వాగ్ సాధించాడు. మార్చి 28,2004న పాకిస్తాన్ పైన 309 పరుగులతో నెలకొల్పిన తన రికార్డును, మార్చి 28, 2008న సౌతాఫ్రికా మీద 319 పరుగులతో తనే అధిగమించాడు.
ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇంగ్లాండు మీద డిసెంబర్ 19, 2016న కరణ్ నాయర్ 303 పరుగులతో భారత్ తరఫున నమోదైన మూడవ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ లో కరణ్ నాయర్ సెహ్వాగ్ రికార్డు అధిగమించేలా కనిపించినా మ్యాచ్ గెలవడానికి తన బౌలర్లకు తగిన సమయం ఇవ్వడానికి జట్టు స్కోరు 759/7 వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. భారత జట్టుకు టెస్టు మ్యాచుల్లో ఇదే అత్యధిక స్కోరు.