Idream media
Idream media
విశాఖపట్నం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన తర్వాత కంపెనీల్లో ఏ ప్రమాదం జరిగినా విశాఖ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఎల్జీ ఘటన తర్వాత వివిధ కంపెనీల్లో వరుస ప్రమాదాలు జరుగుతుండడంతో ఏ చిన్న ప్రమాదం చోటు చేసుకున్న చర్చనీయాంశం అవుతోంది. సాయినార్, విశాఖ ఫార్మా సిటీలో ఇటీవల ప్రమాదాలు జరిగాయి. అన్నీ కూడా కెమికల్స్ ఉన్న కంపెనీలే కావడంతో మంటలు, పొగ దట్టంగా వ్యాపించాయి. విషవాయువు వ్యాపిస్తుందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమైంది.
తాజాగా మరో అగ్ని ప్రమాదం విశాఖలో చోటు చేసుకుంది. షీలానగర్‌లోని గేట్‌వే ఈస్ట్ ఇండియా కంపెనీలో కెమికల్ ఉన్న కంటైనర్‌ను క్రేన్ సహాయంతో తరలిస్తున్న సమయంలో పొగలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలో మంటలు చెలరేగాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ తర్వాత అన్ని ప్రమాదాలు కెమికల్స్ ఉన్న ప్రాంతాల్లోనే జరుగుతుండడం గమనార్హం.