రేయింబవళ్లు కష్టించి రెక్కలు ముక్కలు చేసుకునే రైతన్నకు పంట చేతికి వచ్చేదాకా దినదిన గండమే.. అకాల వర్షాలు,లేదా వర్షాభావ పరిస్థితులు, క్రిమికీటకాల దాడులు ఇలా రకరకాల కారణాలతో రైతు పంటను నష్టపోతూనే ఉంటాడు. తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ అగ్నిప్రమాదం రైతుల ఆశలను బూడిద చేసింది.
వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మామిడి గుండాల గ్రామంలో ని పంట చేలలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా 50 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. ఈ అగ్నిప్రమాదంలో 200 క్వింటాళ్ల మొక్కజొన్నలతో పాటుగా 10 ఎకరాల్లో ఉన్న కంది చేను పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన రైతులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపలే పంట మొత్తం బూడిద కుప్పగా మారిపోయింది. మొత్తం 50 ఎకరాల్లో పంటకు నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు.
కళ్ళముందే రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట అగ్నికి ఆహుతి అవుతుంటే ఆ మంటలను అదుపుచేయలేక నిస్సహాయతతో చూస్తూ ఉండిపోయిన రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఘటన స్థలానికి చేరుకొని రైతులను ఓదార్చే ప్రయత్నం చేశారు. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న పంటలను పరిశీలించిన ఎంలేయ్ తద్వారా జరిగిన పంటనష్టాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. తమ పంటలు అగ్నికి ఆహుతి కావడంతో తమకు తీరని నష్టం వాటిల్లిందని తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.