లోపల చిక్కుకున్న తొమ్మిది మంది ఉద్యోగులు
నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమల పెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ ప్రమాదం చోటు చేసుకుంది .విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.నాలుగో యూనిట్ టెర్మినల్‌లో మంటలు చెలరేగడంతో దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నం చేయగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.మొత్తం ఆరు యూనిట్లలో పొగలు కమ్ముకున్నాయి. దీంతో కొందరు సిబ్బంది బయటకు పరుగులు తీయగా మరికొందరు అందులో చిక్కుకున్నారు.
ప్యానెల్ బోర్డ్ లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని వాటిని అడుపుచేసే ప్రయత్నం చేస్తుండగానే కరెంటు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కొందరు ఉద్యోగులు బయటకు పరుగులు తీయగా మరికొందరు లోపలే చిక్కుకున్నారు. తొమ్మిది మంది ఉద్యోగులు లోపల మంటల్లో చిక్కుకున్నారు. కాగా వారిని కాపాడటానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.సహాయక చర్యల్లో భాగంగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా వీలు పడటం లేదు. దట్టంగా పొగ ఉండటంతో ఇప్పటికే ఫైర్ సిబ్బంది మూడుసార్లు లోపలికి వెళ్లి వెనక్కి వచ్చారు. ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా లోపలికి వెళ్లలేకపోతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు.ఆయన మాట్లాడుతూ శ్రీశైలం లెఫ్ట్ పవర్‌హౌస్‌లో ప్రమాదం దురదృష్టకరమని సహాయక చర్యలు జరుగుతున్నాయని, ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. సింగరేణి సిబ్బంది సహాయాన్ని కోరామని మంత్రి వెల్లడించారు.
ప్రమాదంతో దట్టమైన మంటలు, పొగ అలముకోవడంతో 9 మంది సిబ్బంది బయటికి రాలేక పవర్ హౌస్లో చిక్కుకుపోయారు.
చిక్కుకుపోయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
1) శ్రీనివాస్ DE
2) వెంకట్రావు AE
3) ఫాతిమా బేగం AE
4) మోహన్ AE
5) సుందర్ AE
6) రాంబాబు PA
7) కిరణ్ AE
మరో ఇద్దరు అమరాన్ సంస్థ నుండి వచ్చిన ప్రైవేటు ఉద్యోగులు కూడా లోపల చిక్కుకున్నారని తెలుస్తుంది. మరో రెండు గంటల్లో మంటలు అదుపులోకి వస్తాయని ఈలోగా చిక్కుకున్న వారిని కాపడతామని ఫైర్ సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.