iDreamPost
android-app
ios-app

మూడు దశాబ్దాల “పీవీ” ఆర్ధిక సంస్కరణలు

మూడు దశాబ్దాల “పీవీ” ఆర్ధిక సంస్కరణలు

1980, 70 దశకాల్లో పుట్టిన వారిని ఒక్కసారి కదపండి. వారు ఎన్నో ఎన్నెన్నో తమ చిన్ననాటి అనుభూతులను చెబుతారు. టీవీలు, కరెంట్ లేని కాలాన్ని గుర్తు చేసుకుంటారు. ఒకే ఒక్క టీవీ ఛానల్, రోజుకు ఆరు గంటలు మాత్రమే ఉండే కరెంట్ రోజులు వారినీ 1990 దశకంలో కి తీసుకు వెళతాయి. కానీ తర్వాత రోజులు గురించి చెప్పమంటే మాత్రం కాలం వేగంగా పరిగెత్తింది.. అని ఒక్క మాటలో తేల్చేస్తారు. అసలు 1990 తర్వాత భారత దేశంలో ఈ ఎందుకు ఈ వేగం సాధ్యం అయ్యింది. 1990 దశకానికి, అంతకు ముందుకు ఉన్న తేడాలు ఏమిటి అంటే ఆర్థిక సంస్కరణలే.

1991, జూలై 24వ తేదీన అంటే సరిగ్గా 30 సంవత్సరాల క్రితం దేశ పార్లమెంట్ లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన చారిత్రాత్మక బడ్జెట్ దేశ నడవడికను పూర్తిగా మార్చేసింది. వేగవంతమైన ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్లు అప్పటికి భారత ప్రజలకు గుర్తుండిపోతారు. సరిగ్గా ఈరోజుకు ఆర్థిక సంస్కరణలు మొదలై 30 ఏళ్లు. ఈ 30 ఏళ్లలో భారతదేశం సాధించిన ప్రగతి, అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధి, ప్రజల జీవన విధానాన్ని మార్చిన తీరు ఆర్థిక సంస్కరణల విజయాన్ని సూచిస్తాయి. ఆర్థిక సంస్కరణలకి మూడు దశాబ్దాలు నిండిన ఈ సమయంలో వాటిలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్దగా సంస్కరణలు తీసుకు వచ్చింది లేదు. దేశానికి అవసరమైన అన్ని అంశాలు ప్రభుత్వం వద్ద ఉండేవి. అంటే దేశ ప్రజలకు అవసరం అయిన ముడి సరుకులు తయారీ, పంపిణి ఇతర విషయాలన్నీ ప్రభుత్వం వద్ద ఉండేవి. 98 శాతం మేర అన్ని ప్రభుత్వ సెక్టార్ పరిధిలోనే నడిచేవి. దీంతో ప్రభుత్వానికి రాయితీల భారంతో పాటు వాటి నిర్వహణ భారం అధికమయింది. విదేశీ కంపెనీలు అన్న మాటే వినిపించేది కాదు. అందులోనూ ఒక పరిశ్రమ నెలకొల్పాలి అన్న పెట్టుబడిదారు బోలెడు అనుమతులు తీసుకోవలసి వచ్చేది. దానికి కొన్ని సంవత్సరాలు పట్టేది. ఒకవేళ అప్పటికి పరిశ్రమ ఏర్పాటుకు పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మాత్రమే ఉత్పత్తి, పని, పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. అంటే ప్రతి విషయాన్ని ప్రభుత్వమే చూసుకునే పరిస్థితి ఉండేది. దింతో నిర్వహణ బాధ్యతలు, నష్టాలు కలిపి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. 1980లో మొదలైన దేశ ఆర్థిక సమస్యలు 1990 వచ్చేనాటికి తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసే స్థాయికి చేరుకున్నాయి.

1988లోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి భారతదేశం అప్పు తీసుకోవాలని భావించింది. అయితే అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వచ్చే ఏడాది (1989) ఎన్నికలు ఉన్న సందర్భంగా దాన్ని పక్కన పెట్టారు. అయితే తర్వాత తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పడం మొదలైంది. 1989 ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి రావడం, వి.పి.సింగ్ ప్రధానమంత్రి కావడం జరిగింది. అయితే నేషనల్ ఫ్రంట్ లో మైనారిటీ ప్రభుత్వం ఉండడంతో పాటు ఆ ఫ్రంట్లోని ఇతర పార్టీల మధ్య సఖ్యత లేకపోవడంతో వి.పి.సింగ్ 343 రోజుల తర్వాత రాజీనామా చేశారు. మండల్ వివాదం వీపీ సింగ్ ప్రభుత్వాన్ని దెబ్బతీసింది. ఆయన అనంతరం చంద్ర శేఖర్ ప్రధాని అయ్యారు. 223 రోజులు చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న సమయంలో దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది.

Also Read : కిసాన్ సంసద్ – రైతుల పోటీ పార్లమెంట్ సమావేశాలు

1991లో దేశానికీ మధ్యంతర ఎన్నికలు అనివార్యమయ్యాయి. 1991 ఎన్నికల్లో కనీసం కాంగ్రెస్ టికెట్ కూడా రాని పీవీ నరసింహారావు… రాజీవ్ హత్యానంతరం ఏర్పడిన మైనార్టీ ప్రభుత్వానికి ప్రధాని మంత్రి అయ్యారు. ఆయన వచ్చిన వెంటనే అత్యంత దీనమైన పరిస్థితిలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ మీద దృష్టిపెట్టారు. చిన్న చిన్న రుణాల పై నే అప్పటివరకు ఆధారపడిన భారతదేశం కనీసం ఐదు బిలియన్ డాలర్ల అప్పుకు సైతం వడ్డీ కట్టలేని పరిస్థితి కి వెళ్ళిపోయింది. దీంతో బంగారం తాకట్టు పెట్టి వడ్డీ కట్టే పరిస్థితి వచ్చింది. స్విట్జర్లాండ్ లోని ఓ బ్యాంకు కి మొదట విడతగా తాకట్టు పెట్టారు. ఈ డబ్బుతో వడ్డీ కట్టి నప్పటికీ దేశం పరిస్థితి ఏ మాత్రం మారలేదు. ఫలితంగా రెండో విడతగా రిజర్వుబ్యాంకు వద్ద ఉన్నా బంగారాన్ని తాకట్టు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం 400 మిలియన్ డాలర్ల కోసం అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య బయటకు పొక్కడం అతి పెద్ద వివాదానికి కారణమైంది. దీంతో పాటు దేశ ఆర్థిక పరిస్థితి మీద ప్రపంచ దేశాలు ఓ అంచనాకు రావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

సరిగ్గా ఈ సమయంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ( ఐఎంఎఫ్ ) భారతదేశానికి అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతోపాటు అప్పు ఇవ్వాలంటే కొన్ని షరతులను పెట్టింది. ఈ షరతులు లో భాగంగా ఆర్థిక సంస్కరణలకు భారత ప్రభుత్వం బీజం వేసింది. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాక మొదట ఐజీ పటేల్ ను ఆర్థికమంత్రి చేయాలని భావించారు. దానికి పటేల్ అంగీకరించకపోవడంతో యూజీసీ చైర్మన్ గా పనిచేస్తున్న మన్మోహన్ సింగ్ వైపు పీవీ చూపు పడింది.

మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా 1991, జూలై 24వ తేదీన పూర్తిస్థాయి బడ్జెట్ ను లోక్సభలో ప్రవేశపెట్టడమే కాకుండా, ఆర్థిక సంస్కరణలకు దారి చూపారు. అప్పటివరకు ఉన్న లైసెన్స్ రాజును ఎత్తివేయడం తో పాటు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా పలు విధానాలను తీసుకొచ్చారు. అలాగే సాఫ్ట్వేర్ ఉత్పత్తులను దేశంలోనే తయారీ చేసి ఎగుమతి చేసేందుకు వీలుగా ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 కింద మినహాయింపు ఇచ్చారు.

ఆర్థిక సంస్కరణలను ప్రతిపాదించిన అంశాల మీద కాస్త వివాదం ఉంది. దీనికి ఆద్యుడిగా పీవీ నరసింహారావు మన్మోహన్ సింగ్ ల పేర్లు ఇప్పటికీ చాలామంది చెబితే, అంతకు ముందే అంటే చంద్రశేఖర్ ప్రభుత్వంలోనే ఈ ఆర్థిక సంస్కరణలు తయారు చేసినట్లు కొంత మంది ఇప్పటికీ చెబుతారు. అప్పటి చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా ఈ ఆర్థిక సంస్కరణలను పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉందని 1991, ఫిబ్రవరి 18 వ బడ్జెట్లో ప్రత్యేకంగా ఆర్థిక సంస్కరణల మీద యశ్వంత్ సిన్హా బడ్జెట్ ప్రసంగం చేయాల్సిన సమయంలో దానిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది అనేది ఒక వాదన.

మొత్తం మీద ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో గణనీయంగా మార్పులు వచ్చిన మాట వాస్తవం. ప్రజల జీవన స్థితిగతులు మారాయి. అయితే ఇప్పటికీ ఈ ఆర్థిక సంస్కరణల బాటలో ఎక్కడో ఏదో లోపం ఉండడం వల్లనే దేశం” అభివృద్ధి చెందుతున్న దేశాల ” మాటున ఉండిపోయింది అన్నది విశ్లేషకుల మాట.

Also Read : మూడు ముక్కల బీజేపీ