కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేసేందుకు ప్రభుత్వరంగ ఆస్తులను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వo సిద్ధమవుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆరు లక్షల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా వచ్చే నాలుగేళ్లలో కేంద్రం ఆస్తులను ప్రైవేటీకరణ ద్వారా సమకూర్చుకోవాలని రోడ్ మ్యాప్ కూడా ప్రకటించారు. దీనికి జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ అని పేరు కూడా పెట్టారు. రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్‌పైప్‌లైన్‌లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఆస్తుల విక్రయాలు చేపట్టినట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నిర్ధిష్ట కాలానికి ఆస్తుల అమ్మకం ద్వారా నిధుల సమీకరణను చేపట్టనున్నట్టు ఆమె చెప్పారు. కీలక రంగాలు మినహా మిగతా రంగాలను ప్రైవేటికరించాలని నిర్ణయించినట్లు సీతారామన్ ప్రకటించారు. ఆస్తుల యాజమాన్య హక్కులు మాత్రం ప్రభుత్వానికే ఉంటాయని ఆమె స్పష్టంచేశారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన కేంద్ర ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో భారీగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయనున్నట్లు సంకేతాలు అందించింది.
బిఎస్ఎన్ఎల్,విశాఖ ఉక్కు వంటి సంస్థల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతతో పాటు ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం లేదా ప్రైవేటీకరణ విషయంలో వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే వివిధరంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం ఆదాయం లేని ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడం ద్వారా ప్రభుత్వంపై ఉండే పెట్టుబడి భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చని భావనకు కేంద్ర ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే కేంద్రం చేపడుతున్న ప్రైవేటీకరణ ప్రభుత్వరంగ ఆస్తుల అమ్మకం పై వామపక్షాలు, విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలాగే కొనసాగితే వచ్చే ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో ఒక్కొక్క దాన్ని అమ్ముకుంటూ వస్తుందని చివరికి ప్రభుత్వ రంగంలో ఏ సంస్థ మిగలదని ఎద్దేవా చేస్తున్నాయి. ఇప్పటికే నిరుద్యోగ రేటు పెరిగిపోతున్న భారతదేశంలో ప్రస్తుతం కేంద్రం తీసుకునే నిర్ణయం ఉద్యోగ రంగంపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు సంపాదించే నిరుద్యోగులు కేంద్రం నిర్ణయంతో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సంపాదించలేక నిరుద్యోగ రేటు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలను లాభాపేక్షతో కాకుండా ప్రజల సంక్షేమం దృష్టితో నడపాలని కేంద్రానికి సూచిస్తున్నారు. బిజెపికి ప్రభుత్వాన్ని నడపడం రాదని ప్రభుత్వరంగ సంస్థల అమ్మడం ద్వారా ప్రభుత్వాన్ని నడపాలని బీజేపీ భావించడం దురదృష్టకరం అంటున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను గత ప్రభుత్వాలు అమ్మడం లేదా ప్రైవేటీకరణ చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా ఉద్యోగ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. రోజు రోజుకు పెరుగుతున్న నిరుద్యోగం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజగా తీసుకున్న నిర్ణయం నిరుద్యోగుల పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రం తన మొండి వైఖరిని వదలడం లేదు. ఆదాయం లేని కేంద్ర సంస్థలను కొన్నింటిని ప్రైవేటీకరించడం మంచిదే అయినప్పటికీ ప్రజల సంక్షేమం ముడిపడి ఉన్న సంస్థలను కూడా కేంద్రం ప్రైవేటీకరణ చేయడం లేదా అమ్మాలని చూడడం దురదృష్టకరమని దీనికి మోడీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
Also Read : అదే జరిగితే ఉత్తరాది పెత్తనం పెరుగుతుందా..?