iDreamPost
iDreamPost
ఎట్టకేలకు సుమారు యాభై రోజుల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఒక థియేటర్ గేట్లు తెరుచుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మెల్లగా తగ్గుతున్న తరుణంలో హాళ్ల యజమానులు మెల్లగా వీటిని రెడీ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఇవాళ నుంచి వైజాగ్ లోని సుప్రసిద్ధ జగదాంబ థియేటర్లో క్రాక్ ని ఉదయం 10.30 గంటలకు కేవలం ఒక్క ఆటతో ప్రదర్శనలు మొదలుపెట్టారు. సాయంత్రం తర్వాత మళ్ళీ కర్ఫ్యూ కొనసాగుతుంది కాబట్టి రెండు షోలు వేసుకోవడం కష్టం. అందుకే ఒకరకంగా చెప్పాలంటే ప్రయోగాత్మకంగా క్రాక్ సినిమాతో షోలు మొదలుపెట్టి అక్కడి రెస్పాన్స్ ని బట్టి మిగిలిన చోట్ల కూడా ఓపెన్ చేస్తారు.
ఇండస్ట్రీలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు బోలెడు ఉన్నప్పటికీ ఇంకా ఎవరూ డేట్లు అనౌన్స్ చేయలేదు. థర్డ్ వేవ్ ప్రచారం నిజమా అబద్దమా అని తేలితే అప్పుడు నిర్ణయం తీసుకుందామని కొందరు సింగల్ స్క్రీన్ ఓనర్లు ఆచితూచి వ్యవహరించే ధోరణిలో ఉన్నారు. అసలు జనం వస్తారా రారా అని తెలుసుకోవడానికైనా ఏదో ఒక సినిమా వేస్తూ ఉండటం బెటర్. క్రాక్ లాంటి నిన్న మొన్నవి కాకుండా కొంత వెనక్కు వెళ్లి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ ప్రదర్శిస్తే ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తారని సీనియర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఓటిటిలో స్ట్రెయిట్ రిలీజ్ అయినవి కూడా ఇప్పుడు థియేటర్లలో వచ్చే అవకాశం ఉంది.
అటుఇటుగా గత ఏడాది వచ్చిన సిచువేషనే మళ్ళీ కళ్ళముందు కనిపిస్తోంది. జనం లాక్ డౌన్ లేని టైంలో ఎప్పటిలాగే బయట తిరుగుతున్నారు. పనులు చేసుకుంటున్నారు. తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. కేవలం సినిమాలు మాత్రమే చూడకూడదని అధిక శాతం అనుకోవడం లేదు. కాబట్టి సడలింపు సమయం పెంచాక కనీసం రెండు మూడు షోలు పడటం మొదలుపెడితే మెల్లగా అలవాటు చేసుకుంటారు. ఇవాళ జగదాంబకు వచ్చే స్పందనను బట్టి గుంటూరు విజయవాడలో కూడా తెరిచేలా ప్లాన్ చేసుకున్నారు. క్రాక్ చూసేసిన సినిమా కాబట్టి ఆన్ లైన్ బుకింగ్ అంత జోరుగా లేదు కానీ నేరుగా కౌంటర్ సేల్స్ చూస్తే క్లారిటీ వస్తుంది