వైయస్సార్సీపి ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు చేసింది. ఎమ్మెల్యేల కోటాలో ఇటీవల ఖాళీ అయిన వాటిని భర్తీ చేసేందుకు జగన్ ఇటు సీనియారిటీని గుర్తించి, అటు ఇచ్చిన హామీ లను నెరవేర్చేనందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో విజయవాడ పశ్చిమ నియోజక వర్గానికి చెందిన మైనారిటీ మహిళ కు జగన్ అవకాశం ఇవ్వడం విశేషం.
అనుకున్నట్టుగానే ఇరు కుటుంబాలకు…
ఇటీవల టిడిపి నుంచి ముగ్గురు, వైసీపీ నుంచి ముగ్గురు పదవీ విరమణతో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలు సంఖ్యా బలం ఆధారంగా వైసీపీ కే లభిస్తాయి. వీటిలో రెండు సీట్లను పదవుల్లో వుండి మృతి చెందిన పార్టీ నేతల కుటుంబాలకే ఇచ్చారు. తిరుపతి ఎంపీగా గెలిచి కరోనా తో మృతి చెందిన బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి కి, మరొకటి ఎమ్మెల్సీగా ఉంటూ మృతి చెందిన కర్నూల్ జిల్లా నేత చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు చల్లా భగీరథ రెడ్డి కి కేటాయించారు.
బల్లి కళ్యాణ్ చక్రవర్తి కి ఎమ్మెల్సీ ఇవ్వటంతో వైసీపీ తరుపున తిరుపతి ఉప ఎన్నికలో బల్లి దుర్గాప్రసాద్ కుటుంబం నుంచి కాకుండా కొత్త అభ్యర్ధీ పోటీకి దిగటం ఖాయం.
Also Read:తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి..?
సీనియారిటీ, పార్టీకోసం పని
సీనియర్ నేత ,పార్టీ నిర్వహణ,నిర్మాణంలో కీలకంగా వ్యవహరించే సి. రామచంద్రయ్యకు ఎమ్మెల్సీగా జగన్ అవకాశం ఇచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ, పార్టీ కార్యకలాపాల్లో విస్తృతంగా పనిచేస్తున్న ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చినట్లయింది.
ఇక ఉత్తరాంధ్రలో పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసి, 2014 లో టెక్కలిలో అచ్చెంనాయుడు మీద పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోయి, 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ సభకు పోటీ చేసి రామ్మోహన్ నాయుడు మీద కేవలం 6600 ఓట్ల తేడాతో ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
Also Read:బల్లి దుర్గాప్రసాద్ రాజకీయ ప్రయాణం,చంద్రబాబు భూవివాదం.
మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడును ఢీకొట్టి అచ్చెన్నాయుడు సొంత ఊరు నిమ్మాడలో తొలిసారి ఎన్నికలు జరిగేలా దువ్వాడ శ్రీనివాస్ చేశారు.దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నియోజక వర్గంలో ఎర్రంనాయుడు కుటుంబ అధిపత్యానికి బ్రేకులు వేస్తూ ఎక్కువ పంచాయితీలలో వైసీపీని గెలిపించారు. ఇక్కడ అచ్చెన్నాయుడు కు దీటుగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ బలం పుంజుకోవాలని భావించే ప్రోటోకాల్ హోదా కల్పించినట్లు తెలుస్తోంది.
మైనారిటీలకు రెండు
మైనారిటీలకు రాజకీయంగా ప్రాధాన్యత నివ్వడం లో ఎప్పుడూ ముందుండే ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్సీ లోను రెండు వారికి కేటాయించారు. ఇక గత ఎన్నికల్లో సినీ నటుడు బాలకృష్ణ మీద పోటీ చేసి ఓడిపోయిన మహమ్మద్ ఇక్బాల్ కు మరోసారి జగన్ అవకాశం ఇచ్చారు. గతంలోనే ఆయనకు ఇచ్చిన హామీ మేరకు జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినా లక్కీ డ్రా లో తక్కువ కాలం మాత్రమే పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో ఆయన ఇటీవల మూడేళ్లకే పదవి విరమణ చేశారు.
Also Read:చల్లా రామకృష్ణారెడ్డి – ఫ్యాక్షన్ నుంచి ఆధునిక రాజకీయాల వరకు
ఇక ఎవరూ ఊహించని విధంగా విజయవాడ పాతబస్తీ నుంచి గతంలో పార్టీ తరఫున కార్పొరేటర్ గా పనిచేసిన కరి మున్నీసాను తెరపైకి తీసుకొచ్చారు. మైనారిటీ వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆమెకు తగిన గౌరవం దక్కింది. దీంతో సీమ నుంచి ఒకరికి కోస్తా నుంచి మరొకరికి మైనారిటీలకు అవకాశం ఇచ్చినట్లు అయింది.
మరికొన్ని ఖాళీ అయితే…
వచ్చే మే, జూన్ నెలల్లో ఇటు నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టులతో పాటు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలను ఎన్నుకునే అవకాశం వస్తుంది. ఆ సమయంలో పార్టీ కోసం కష్టపడిన మరికొందరికి జగన్ అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.
Also Read:ఎవరీ గురుమూర్తి , తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ టికెట్ ఖాయమేనా ?
అన్నీ సమతూకలను చూసి, తగిన సమయంలో తగిన వ్యక్తులను జగన్ ఎంపిక చేస్తారని ఇప్పటికే వైస్సార్సీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అధినేత ఎవరిని ఎంపిక చేసినా దానికి సరైన లెక్క ఉంటుందని వారు భావిస్తున్నారు. మొత్తానికి సమతూకంగా, ఇటు సీనియర్లకు, అటు పార్టీకోసం కష్ట పడిన వారికి జగన్ తగిన గుర్తింపు ఇచ్చినట్లు ఎంపిక ఉందనేది పార్టీ నేతల మాట.