iDreamPost
android-app
ios-app

థియేటర్ల శాశ్వత మూసివేత – దేనికి సంకేతం

  • Published Nov 26, 2020 | 6:33 AM Updated Updated Nov 26, 2020 | 6:33 AM
థియేటర్ల శాశ్వత మూసివేత – దేనికి సంకేతం

కరోనా లాక్ డౌన్ వల్ల థియేటర్లు ఎనిమిది నెలలకు పైగా మూతబడటం ఎలాంటి విపరీత పరిణామాలకు దారి తీస్తుందో ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇప్పటికే విపరీత నష్టాలతో కుదేలైపోయిన ఎగ్జిబిటర్ల రంగం ఎప్పటికి కోలుకుంటుందో అంతు చిక్కడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలో పలు సింగల్ స్క్రీన్లు శాశ్వత మూసివేత దిశగా వెళ్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అన్నీ గొప్ప చరిత్ర కలిగినవి కావడంతో ఆయా ప్రాంతాల ప్రజలకు వాటితో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ లక్షలాది ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ఈ హాళ్లు ఇకపై మూగబోవడం ఎవరికైనా బాధ కలిగించేదే.

మెహదీపట్నం అంబా, టోలీచౌకీ గాలక్సీ, బహదూర్ పుర శ్రీరామా, క్రాస్ రోడ్స్ శ్రీ మయూరి, నారాయణగూడ శాంతి థియేటర్లు ఇకపై గేట్లు తెరుచుకోవని సమాచారం. వీటిలో రెండు మూడు షాపింగ్ కాంప్లెక్సులుగా మార్చడానికి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కూడా జరిగినట్టు వినికిడి. ఒకటో రెండో మాల్స్ గా మారే ఛాన్స్ ఉంది. మల్టీ ప్లెక్సులు ఎన్ని వచ్చినా సింగల్ స్క్రీన్లు ఇచ్చిన అనుభూతి ఎప్పటికీ ఇవ్వలేవు. సరసమైన ధరలో టికెట్లతో పాటు ఇంటర్వెల్ లో కడుపు నిండా తినేలా స్నాక్స్ అందుబాటు ధరలో ఉండటం కేవలం వీటిలోనే సాధ్యం. రెండు రూపాయలకే సమోసాలు అందుకున్న జ్ఞాపకాలు అక్కడే ఉన్నాయి.

రాను రాను నిర్వహణ భారం అధికమవుతున్న తరుణంలో యాజమాన్యాలు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. 2020లో ఓటిటిల వల్ల ప్రేక్షకులు బుల్లితెర వినోదానికి విపరీతంగా అలవాటు పడ్డారు. రాబోయే రోజుల్లో సినిమా చాలా బాగుందంటే తప్ప జనం కుటుంబాలతో కలిసి హాళ్లకు వచ్చే పరిస్థితి ఉండదు. అందులోనూ రిలీజ్ రోజు మ్యాట్నీ లోపే రకరకాల రివ్యూలు, పబ్లిక్ టాక్ ఇంటర్వ్యూల రూపంలో సదరు సినిమాల జాతకాలన్నీ సోషల్ మీడియా వేదికగా బయట పడుతున్నాయి. డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ చీప్ గా మారుతున్న తరుణంలో సింగల్ స్క్రీన్ల మనుగడ ఇంకా క్లిష్టంగా మారబోతుందనడానికి ఇంతకన్నా సాక్ష్యం వేరే కావాలా.