iDreamPost
iDreamPost
కరోనా ఎప్పుడు తగ్గుముఖం పట్టి థియేటర్లు తెరుచుకుంటాయో అర్థం కాని పరిస్థితిలో కొత్త సినిమాల నిర్మాతలు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకోవడంలో బోలెడు అయోమయాన్ని ఎదురుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఓపెన్ చేసినా జనం తండోపతండాలుగా వస్తారన్న గ్యారెంటీ లేదు. ముందు కొద్దిరోజులు ఎక్స్ పరిమెంట్ గా పాత లేదా చిన్న బడ్జెట్ సినిమాలు వేసి చూడాలి. ఎప్పటిలాగే పబ్లిక్ ఆసక్తి చూపిస్తున్నారు అనుకుంటే అప్పుడు డేట్లను లాక్ చేసుకోవచ్చు. హాళ్లు తెరవగానే అర్జెంట్ గా డిసైడ్ అవ్వాల్సిన వాటిలో నాని వి, అనుష్క నిశ్శబ్దం, రామ్ రెడ్, రానా అరణ్య, ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, వైష్ణవ్ తేజ్ ఉప్పెన తదితరాలు ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నవి కూడా ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇకపోతే తమిళనాడులో మాత్రం అక్కడి ప్రొడ్యూసర్లు తేదీల విషయంలో ఒక కొలిక్కి వస్తున్నట్టు తెలిసింది. సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ని నవంబర్ 13న విడుదల చేయాలనీ ప్రాధమికంగా నిర్ణయించారట. తెలుగులోనూ ఉంటుంది కాబట్టి ఇక్కడ పోటీ లేకుండా ఇబ్బంది పడకుండా ఇలా చేశారని తెలిసింది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక విజయ్ నటించిన ‘మాస్టర్’ని డిసెంబర్ 11కి తీసుకురాబోతున్నట్టు చెన్నై టాక్. అప్పటికంతా పరిస్థితి నార్మల్ గా అవుతుందనే ధీమాతో నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కార్తి ఖైదితో అన్ని బాషల్లోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక్కడా అదే రోజు విడుదల చేస్తారు.
శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ని వచ్చే ఏడాది జనవరి 15కి వదిలేలా ప్లానింగ్ జరుగుతోందట. అయితే షూటింగ్ ఇంకా బాలన్స్ ఉన్న నేపధ్యంలో ఈ డెడ్ లైన్ మీట్ కావడం అంత సులభం కాదు. ఒకవేళ కరోనా ముందే తెరిపినిస్తే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో చిన్నా చితకా సినిమాలను రిలీజ్ చేస్తారు. పైన చెప్పిన భారీ ప్రాజెక్ట్స్ మాత్రం అంతకన్నా ముందు వచ్చే ఛాన్స్ లేనట్టే. మరి ఇదే తరహాలో మన నిర్మాతలు ముందే కొన్ని డేట్స్ అనుకుంటే మేలేమో. అయినా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో, పబ్లిక్ థియేటర్లకు వస్తారో రారో తెలియనప్పుడు ఇవన్నీ ఎందుకు అంటున్న వాళ్ళు లేకపోలేదు. మూవీ లవర్స్ మాత్రం ఎంతకీ తీరని ఎదురు చూపులతో జీవితంలో మొదటిసారి అతి పెద్ద వెండితెర ఎడబాటుని చవిచూస్తున్నారు.