Idream media
Idream media
రైతులు షరతులకు లోబడి ఉద్యమం చేస్తారా..? అనుమతిచ్చినట్లుగా సింఘూ, చిల్లా, టిక్రీ, గాజీపూర్ ప్రాంతాల్లో మార్గాల్లో కాకుండా ట్రాక్టర్ల పరేడ్ రూటు మారితే..? ఢిల్లీలోకి ప్రవేశించిన తర్వాత ట్రాక్టర్లు వెనక్కి వెళ్లకపోతే..? షరతులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందే హెచ్చరించారు. కానీ.. పోలీసుల హెచ్చరికలను వారు ఖాతరు చేయకపోతే..? ఇలాంటి ఎన్నో అనుమానాలు రైతుల ర్యాలీ సందర్భంగా వెల్లువెత్తుతాయి. ఇప్పుడు అవే నిజం అయ్యాయి. ట్రాక్టర్ల ర్యాలీ ఉద్యమం మలుపు తిప్పింది. ఫలితంగా ఢిల్లీ రణరంగంగా మారింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోట వద్ద వేడుకలతో పాటు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రైతు ఉద్యమం ఎర్రకోటకు చేరడాన్ని కొందరు మరో స్వాతంత్ర్య ఉద్యమంగా భావిస్తే.. మరికొందరు ఎర్రకోటపై జెండా ఎగురవేయడాన్ని విమర్శిస్తున్నారు.
ముందే ఎత్తు వేశారా..?
వ్యవసాయ చట్టాల రద్దు కోసం నిర్విరామంగా చేస్తున్న రైతుల పోరాటం విరమింపచేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఆది నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 11 దఫాలుగా చర్చలు జరిపింది. కానీ.. రైతులు చెప్పినట్లుగా చట్టాల రద్దుకు కాకుండా ఎన్నో సవరణలను రైతు సంఘాల ముందు ఉంచుతోంది. తాజాగా జరిగిన సమావేశంలో కూడా ఏడాదిన్నర పాటు చట్టాలు అమలు చేయబోమని చెప్పింది కానీ.. రద్దు చేస్తామన్న హామీ కేంద్రం ఇవ్వలేదు. ఒకవైపు చర్చలు జరుపుతూనే.. మరోవైపు కిసాన్ ట్రాక్టర్ల ర్యాలీ జరగకుండా ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అన్ని ప్రయత్నాలూ విఫలం కావడంతో చేసేదేమీ లేక ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవతే అది మరింత చెడ్డ పేరు తెస్తుందని భావించింది. ఈ క్రమంలో అనుమతి అయితే ఇచ్చింది కానీ.. 36 కఠిన షరతులు విధించింది. దీనిపై రైతు సంఘాలన్నీ చర్చించిన అనంతరం వాటికి అంగీకరించొద్దని తొలుత భావించారు. అయితే ముందు అనుమతి పొంది.. తర్వాత తమ వ్యూహం అమలు చేద్దామని భావించినట్లుగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే రిపబ్లిక్ డే సందర్భంగా జరిపిన ర్యాలీ సందర్భంగా తమ సత్తా చాటారు.
ప్రపంచానికి చాటాలనే..
కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాగు చట్టాలు, వాటి పర్యవసానాలపై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న చర్చను విశ్వ వ్యాప్తం చేయాలన్నదే తమ ఉద్దేశమని కొన్ని రైతు సంఘాలు చెబుతున్నాయి. అందుకు ఈ ట్రాక్టర్ల ర్యాలీని మార్గంగా మలుచుకున్నట్లు తెలుస్తోంది. అందుకే అనుమతి పొందిన పరిధికి మించి హస్తినలోకి ట్రాక్టర్లతో రైతులు ప్రవేశించారు. అంతటితో ఆగకుండా ఎర్రకోటలోకి చొచ్చుకెళ్లారు. వందలాది మంది ఎర్రకోటలోకి దూసుకెళ్లి కొత్త చట్టాలను రద్దు చేయాలని నినదించారు. వందలాది మంది సైనికులు ఎర్రకోటలో కవాతు నిర్వహిస్తుండగా.. రైతు ఉద్యమ సైనికులు ఎర్రకోటపై రైతు జెండాను ఎగురువేశారు. ఇంతలా తెగించి ముందుకు దూసుకెళ్లడం వెనుక తమ ఉద్యమ ఉద్దేశాన్ని ప్రపంచానికి చాటాలనే తపన కనిపిస్తోంది.
మరి కేంద్రం ఏం చేస్తుంది..?
చర్చల ద్వారానే రైతుల ఉద్యమాన్ని విరమింపచేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. దాదాపు 11 మార్లు రైతు సంఘాలతో చర్చలు జరిపింది. మరో దఫా కూడా చర్చలు జరపడానికి సిద్ధమనే సంకేతాలు ఇచ్చింది. ఏడాదిన్న వరకూ ఆ చట్టాలను అమలు చేయబోమని కూడా తేల్చి చెప్పింది. అయినప్పటికీ వాయిదా కాదు.. రద్దు కావాలని రైతు సంఘాలు కేంద్రం ప్రతిపాదనలను తోసిపుచ్చాయి. దీనికి తోడు ఇప్పటి వరకూ శాంతియుతంగా చేపట్టిన ఉద్యమాన్ని రూటు మార్చారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకోబోయే చర్యలపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. రైతుల డిమాండ్లకు లోబడి చట్టాలను రద్దు చేస్తుందా..? చర్చల ద్వారా ఎంత ప్రయత్నిస్తున్నా రైతుల్లో మార్పు రాకపోగా ఎర్రకోటలోకి చొచ్చుకు రావడానికి తీవ్రంగా పరిగణించనుందా..? అనే దానిపై చర్చ జరుగుతోంది.