Idream media
Idream media
రైతు పోరాటంతో దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుమారు 12 రోజులుగా రోడ్లపై ఆందోళనలు చేపడుతున్న రైతుల అవసరాలు తీర్చేందుకు ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారు. పాలు, ఆహారం అందిస్తున్నారు. చలి నుంచి రక్షణ కోసం బ్లాంక్లెట్లు పంపిణీ చేస్తున్నారు. విదేశాల నుంచి కూడా వారికి వివిధ రూపాల్లో సహాయం అందుతోంది. పంజాబ్ ముస్లిం ఫెడరేషన్ రైతుల వంటకు కావాల్సిన బియ్యం, మందులు పంపిణీ చేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీ కి వెళ్లాలంటే మరికొందరు వారికి వాహనాలు సమకూరుస్తున్నారు. ఇంకొందరు ఉచితంగా డీజిల్ సరఫరా చేస్తున్నారు. ఇలా అన్ని రకాలుగానూ రైతులకు మద్దతు లభిస్తోంది. ఇదిలా ఉండగా… వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. అంతే కాకుండా ఢిల్లీలోని ఏడు మైదానాలను జైళ్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని దానికి తాను ఒప్పుకోవడం లేదని కేజ్రీవాల్ పలుమార్లు చెప్పారు. అయితే తాజాగా నిరసన చేస్తున్న రైతులను కలుసుకునేందుకు కేజ్రీవాల్ వెళ్లారు. అనంతరం ఇంటికి వచ్చిన ఆయనను ఢిల్లీ పోలీసులు హౌజ్ అరెస్టు చేయడంతో చర్చనీయాంశంగా మారింది.
ఆఫ్ నేతల నిరసన
‘భారత్ బంద్’ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను హౌస్ అరెస్ట్ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేసింది. సింఘా సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి వచ్చినప్పటీ నుంచి ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్ నివాసం నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ, బయటవారు లోనికి ప్రవేశించడానికి కానీ పోలీసులు అనుమతించడం లేదని ఆరోపించింది. ఈ మేరకు ఆప్ లీడర్ సౌరవ్ భరద్వాజ్ ‘ఆయనను బయటకు రానీవ్వడం లేదు.. మమ్మల్ని ఎవరిని లోనికి అనుమతించడం లేదు. నిన్న ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యేలను పోలీసులు కొట్టారు. పని వారిని కూడా లోనికి వెళ్లనివ్వడం లేదు. ఆయన నివాసం బయట బీజేపీ నాయకులు బైఠాయించారు’ అంటూ ట్వీట్ చేశారు. ఇల్లు దాటి బయటికి రాకుండా ఆయన నివాసంలోనే బంధించినట్లు ఆప్ నేతలు చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆప్ కార్యకర్తలతో కలిసి సీఎం నివాసం వద్ద ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను నిర్బంధం నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాధినేతనే ఇలా చేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు, ఆప్ మధ్య వార్
కేజ్రీవాల్‌ను సోమవారంనాడు కలవడానికి వెళ్లిన పలువురు ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని, కనీసం కార్యకర్తలను కూడా కలుసుకునేందుకు అనుమతించలేదని, బీజేపీ వాళ్లను మాత్రం కేజ్రీవాల్ నివాసం వెలుపల బైఠాయించేందుకు అనుమతించారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. సింఘు సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులను కేజ్రీవాల్ కలుసుకుని సంఘీభావం తెలిపారని, ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన ఇంటికి అన్ని వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి హౌస్ అరెస్టు చేశారని తెలిపారు. హోం మంత్రిత్వ శాఖ తరఫున పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేసినట్టు చెప్పారు. అయితే ఆప్ వ్యాఖ్యలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. కేజ్రీవాల్‌ను గృహ నిర్భంధంలో ఉంచామని చెప్పడం అవాస్తమని అన్నారు. తాము ఆప్, ఇతర పార్టీల మధ్య ఘర్షణ తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టుగా తెలిపారు. ఈ క్రమంలోనే ట్విటర్‌లో కేజ్రీవాల్ నివాసం వద్ద ఎలా ఉందో చూడండి అని ఓ ఫొటోను పోస్ట్ చేసింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్పందించింది. పోలీసులకు, ఆప్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరుగుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆప్.. ఆధారాలను తారుమారు చేయవద్దని కోరింది. ఈ వీడియో ఏమిటో చెప్పాల్సిందిగా పోలీసులను ప్రశ్నించింది. తమ ఎమ్మెల్యేలను సీఎం కేజ్రీవాల్‌ను కలవడానికి అనుమతించకుండా ఎందుకు లాగివేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది.