నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా చక్కా జామ్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సాగిన ఈ రాస్తారోకో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.
హైదరాబాద్ హయత్ నగర్ లో తెలంగాణ ఆలిండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో రైతుసంఘాల నేతలు ఎడ్ల బండ్లపై హైవేపై ర్యాలీ నిర్వహించారు.పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో పలుచోట్ల రైతులు జాతీయ రహదారులను దిగ్బంధించగా బెంగళూరు, పుణె, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను మధ్యాహ్నం 3 గంటల తర్వాత వదిలేశారు.
కాగా గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ జరిగిన దుర్ఘటనల దృష్ట్యా రైతులు తలపెట్టిన చక్కా జామ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో దాదాపు 50వేల మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. .సింఘు, టిక్రీ, గాజీపుర్ సరిహద్దుల్లో మరిన్ని బారీకేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు జలఫిరంగులను కూడా సిద్ధంగా ఉంచింది. ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ మెట్రో స్టేషన్ల ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను మూసివేశారు..
చెదురుమదురు సంఘటనలు మినహా చక్కా జామ్ శాంతియుతంగా జరగడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. గణతంత్ర దినోత్సవం తర్వాత రైతులు దేశవ్యాప్తంగా చక్కా జామ్ కి పిలుపునివ్వడంతో ఆందోళనలు చెలరేగే అవకాశం ఉందని ప్రభుత్వం అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకుంది.